సోషల్ మీడియా ఆఫర్ల మాయ..! మోసపోకుండా ఎలా జాగ్రత్త పడాలంటే..!

సోషల్ మీడియా ఆఫర్ల మాయ..! మోసపోకుండా ఎలా జాగ్రత్త పడాలంటే..!

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏ రీల్ ఓపెన్ చేసినా.. ‘ఇక్కడ బంపర్ ఆఫర్’, ‘అక్కడ ఉచితం’, ‘రూ. 99లకే స్మార్ట్ వాచ్’, ‘రూ.149లకే అన్​లిమిటెడ్​ బిర్యానీ’ అంటూ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఊదరగొడుతున్నారు. ఉదయం లేచింది మొదలు మనిషి నిత్య జీవితంలో వాడే దుస్తులు, ఆహారం, సోప్స్, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ వరకు ప్రతి దానికి ఆఫర్లు ఉన్నాయంటూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయితే ఈ వీడియోలను నమ్మి తీరా వందల రూపాయల పెట్రోల్ పోసుకుని, గంటల సమయాన్ని వృథా చేసుకుని అక్కడికి వెళ్తున్న కస్టమర్లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.

మొదటి పది మందికి మాత్రమే.. 

‘ఆఫర్ స్టాక్ అయిపోయింది’, ‘అది కేవలం మొదటి 10 మందికి మాత్రమే’, ‘ఆఫర్ సమయం ముగిసింది’ అంటూ వ్యాపారులు మొండిచేయి చూపిస్తున్నారు. మరికొన్ని చోట్ల ‘అంత దూరం వచ్చాం కదా..  ఖాళీ చేతులతో ఏం వెళ్తాం’ అని కస్టమర్లు చేసే ఆలోచనను ఆసరాగా చేసుకుని, నాణ్యత లేని వస్తువులను ఎక్కువ ధరలకు అంటగడుతున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు కేవలం తమ ‘వ్యూస్’, ‘లైక్స్’ కంపెనీలు ఇచ్చే ‘కమిషన్ల’ కోసం సామాన్యులను నట్టేట ముంచుతున్నారు. 

ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓ స్టోర్​కు వెళ్లి మొబైల్ కొంటే సైకిల్ ఉచితం అని రీల్ చేశాడు. అది నమ్మి అక్కడకు వెళ్లిన కస్టమర్లకు స్టోర్​ వాళ్లు చెప్పిన సమాధానం ఏంటంటే.. ‘కేవలం ప్రముఖ బ్రాండ్ కంపెనీకి చెందిన అధిక ధర ఉన్న మొబైల్ కొంటేనే సైకిల్ ఇస్తున్నాం. అది కూడా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్’ అనడంతో కస్టమర్ కంగుతిన్నాడు. వెంటనే ఇన్​ఫ్లుయెన్సర్​కు ఫోన్ చేసి మిమ్మల్ని నమ్మి వేలమంది ఫాలో అవుతుంటే ఇలా డబ్బులు సంపాదించుకోవడం కోసం ఏదీ పడితే అది ఎందుకు చెప్తున్నారంటూ సదరు ఇన్‌ఫ్లుయెన్సర్ పై ఫైర్ అయ్యాడు. 

ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.  దీంతో ఇన్​ఫ్లుయెన్సర్​లు డబ్బులు సంపాదించడం కోసం ఏది పడితే అది రీల్ చేస్తూ అమాయకులను మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు.  

‘కండిషన్స్ అప్లై ’ దోపిడీ 

ఒక సబ్బు కొంటే రెండు ఉచితం, హోమ్ నీడ్స్ అన్నింటిపై 70 శాతం డిస్కౌంట్ అంటూ హోల్‌సేల్ మార్కెట్ పేరుతో ఒక వీడియో వైరల్ అయింది. గృహిణి అయిన సుజాత ఈ ఆఫర్ నమ్మి సరుకులు కొందామని వెళ్లారు. తీరా బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్లాక.. ‘‘మీరు రూ. 5,000 పైగా బిల్లు చేస్తేనే ఈ సబ్బుల ఆఫర్ వర్తిస్తుంది, లేదంటే సాధారణ ధరలే’’ అని షరతులు పెట్టారు. అప్పటికే ట్రాలీలో సరుకులన్నీ సర్దుకుని, అంతసేపు లైన్​లో నిలబడిన శ్రమ వృథా కాకూడదని ఆమె అసలు ధరకే వాటిని కొనుగోలు చేయాల్సి వచ్చింది.

►ALSO READ | ఎల్‌‌నినో దాపురించిన వేళ... వర్షపు నీటిని ఇలా.. ఒడిసిపడదాం.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు...!

ఎలా జాగ్రత్త పడాలంటే..

ముందుగా సోషల్ మీడియాలో వచ్చే ఇన్​ఫ్లుయెన్సర్ల రీల్స్​కు కామెంట్స్ చదవండి. సోషల్ మీడియాలో ఆఫర్ వీడియో చూడగానే వెళ్లకండి. ఆ వీడియో కింద ఉన్న ‘కామెంట్ సెక్షన్’ పరిశీలిస్తే.. అప్పటికే అక్కడికి వెళ్లి మోసపోయిన వారు రాసిన అసలు నిజాలు బయటపడతాయి. వీలైతే సదరు దుకాణం నంబర్ గూగుల్ ద్వారా సేకరించి, ఆఫర్ నిబంధనలు (షరతులు) పూర్తిగా అడిగి తెలుసుకున్నాకే బయలుదేరండి. 

యాడ్స్, రివ్యూస్ మధ్య తేడా గమనించండి. ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసేవి 90 శాతం ‘పెయిడ్ యాడ్స్’ మాత్రమే. వారికి డబ్బులు వస్తాయి కాబట్టి లేనిది ఉన్నట్లు చెప్తారు. విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సోషల్ మీడియాలో ఇప్పటికే మోసపోయినవారు చెప్తున్నారు.  
- రాజశేఖర్​ అల్లకొండ,
 హైదరాబాద్​ సిటీ, వెలుగు

ఎలా మాయ చేస్తున్నారంటే.. 

రూ. 500 లకే 3 బ్రాండెడ్ షర్టులు, ప్యాంట్లు.. వెంటనే రండి’ అని ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్ చేశాడు. కేపీహెచ్‌బీలో ఉండే కిరణ్ ఆ వీడియో చూసి సుమారు15 కిలోమీటర్లు ప్రయాణించి ఆ షాపుకు వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక.. వీడియోలో చూపించిన మంచి దుస్తులు కాకుండా రంగులు వెలిసిపోయిన పాత స్టాక్‌ను చూపించారు. ‘మంచి బట్టలు కావాలంటే రూ. 2,000 పెట్టాలి. వీడియోలో చెప్పిన స్టాక్  ఇదేన’ని షాప్ నిర్వాహకులు సమాధానమిచ్చారు. చేసేదేమీ లేక కిరణ్ తన సమయం, పెట్రోల్ వృథా చేసుకుని వెనుదిరిగాడు. 

సిటీలోనే అతిపెద్ద ఆఫర్.. ‘‘ఒక చికెన్ బిర్యానీ కొంటే రెండు ఫ్రీ.. కేవలం రూ. 250 మాత్రమే’’ అంటూ నోరూరించేలా ఫుడ్ వ్లాగర్ రివ్యూ ఇచ్చాడు.  దిల్​సుఖ్​నగర్‌కు చెందిన నలుగురు స్నేహితులు ఆ హోటల్‌కు వెళ్లారు. అక్కడ అప్పటికే చాలామంది క్యూలో ఉన్నారు. సరిగ్గా వీళ్లు కౌంటర్ దగ్గరికి వెళ్లేసరికి.. ‘‘ఆఫర్ మొదటి 50 మందికి మాత్రమే.. అని బోర్డు పెట్టడం మర్చిపోయాం’’ అని యాజమాన్యం బోర్డు తిప్పేసింది. వేరే దారి లేక వాళ్లు ఎక్కువ మొత్తం చెల్లించి తినాల్సి వచ్చింది.

స్టోర్ ఓపెనింగ్ ఆఫర్.. కేవలం రూ. 99లకే బ్రాండెడ్ స్మార్ట్ వాచ్, ఇయర్‌బడ్స్’  అని ఇన్‌స్టాలో లైవ్ ప్రమోషన్ చేశారు. అమీర్‌పేట్‌లో ఉండే కాలేజీ విద్యార్థిని శృతి, ఆఫర్ లైవ్ చూసిన వెంటనే ఆటోలో షాపుకు పరిగెత్తింది. అయితే, ‘‘ఆఫర్ టైమ్ ఒక గంట మాత్రమే.. ఇప్పుడు కొనాలంటే రూ.1,500 అవుతుంది’’ అని చెప్పారు. ఇదంతా కేవలం కస్టమర్లను షాపుకు రప్పించుకోవడానికి ఆడిన డ్రామా అని ఆమెకు అర్థమైంది.