ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో తగ్గుతున్న వర్షపాతం.. మరోవైపు పెరుగుతున్న జనాభా, వేగంగా విస్తరిస్తున్న నగరాలు, క్షీణిస్తున్న భూగర్భ జలాలు.. ఈ పరిస్థితులు తెలంగాణను భవిష్యత్తులో తీవ్రమైన నీటి సంక్షోభం వైపు నెడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుతుండటంతో, ప్రతి వర్షపు చుక్కను భూమిలోకి పంపే రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్, వాటర్‌షెడ్ అభివృద్ధి, చెరువుల పునరుద్ధరణ వంటి చర్యలే నీటి భద్రతకు కీలక మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.
పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే ఎల్‌నినో ప్రభావం భారత రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీనివల్ల దేశంలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ వర్షపాతం తగ్గడం, వర్షాల పంపిణీలో అసమతుల్యత ఏర్పడడం వల్ల భూగర్భ జలాల పునరుద్ధరణ కూడా మందగిస్తోంది. తెలంగాణ వంటి వర్షాధార రాష్ట్రాలకు ఇది దీర్ఘకాలిక సవాలుగా మారుతోంది.
లోటు వర్షపాతం నమోదు
తెలంగాణ రాష్ట్ర సగటు వార్షిక వర్షపాతం 905 – 920 మిల్లీమీటర్లు కాగా, ఇందులో నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల జూన్– సెప్టెంబర్ నెలల్లోనే 79 శాతం వాటా వర్షపాతం నమోదవుతుంది. ఈశాన్య రుతు పవనాల వాటా14 శాతం, మిగిలిన వర్షపాతం శీతాకాలం, వేసవికాలంలో కురుస్తుంది. ప్రస్తుతం 2026 ఖరీఫ్ సీజన్లో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాత లోటు ఏర్పడింది. తెలంగాణలో జూన్1 నుంచి జులై16 వరకు నమోదైన వర్షపాతం158.8 మిల్లీమీటర్లే. ఇదే కాలానికి సాధారణ వర్షపాతం 243.2 మిల్లీమీటర్లు కాగా 35 శాతం వర్షపులోటు ఏర్పడిందని తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ కన్వీనర్ ఎస్.కె మీరా చెప్పారు.
వర్షపు నీరు వృథా
తెలంగాణలో కురిసే వర్షపునీటిలో 70–80 శాతం వరకు నీరు ఉపరితల ప్రవాహంగా వాగులు, కాల్వలు, నదుల ద్వారా సముద్రంలోకి వెళ్లిపోతుందని తెలంగాణ భూగర్భ జలశాఖ డైరెక్టర్ కె. లక్ష్మా చెప్పారు. కేవలం10–20 శాతం మాత్రమే భూగర్భ జలాలుగా రీచార్జ్ అవుతుందన్నారు. మిగిలిన నీరు ఆవిరైపోవడం లేదా మొక్కలకు వినియోగించడం జరుగుతుందన్నారు. ప్రతీ ఇల్లు, ప్రతి అపార్ట్‌మెంట్, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థ అమలు చేస్తే భూగర్భ జలమట్టాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉందన్నారాయన.
ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నాం
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతలోటు దృష్ట్యా రైతులు, ప్రజలు తీసుకోవలసిన ముందుజాగ్రత్త చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ భూగర్భ జలశాఖ సంచాలకులు చెప్పారు. తెలంగాణ భూగర్భ జలశాఖ, మున్సిపల్ సంస్థలు, గ్రామీణాభివృద్ధి శాఖలు కలిసి కొత్త భవనాల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నాయి. హైడ్రా ద్వారా చెరువుల పునరుద్ధరణ, వాటర్‌షెడ్ పనులు, వర్షపు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టామని ఆయన వివరించారు.
ప్రజలు చేయాల్సింది ఏమిటి?
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఇంట్లో రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం ద్వారా వర్షపు నీటిని కాల్వల్లోకి వదలకుండా భూమిలోకి ఇంకేలా చూడాలి. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలి. నీటి వృథాను తగ్గించి పొదుపుగా వాడాలి. నీటి లీకేజీల నివారణ, ఇంటి పరిసరాల్లో మొక్కల పెంపకం చేపట్టాలి. నీటి వాడకంపై కుటుంబ సభ్యుల్లో అవగాహన కల్పించాలి.
ఆరుతడి పంటలు వేసుకోవాలి
రైతులు ఎక్కువ నీరు పెట్టే పంటలైన వరి నుంచి తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు, ఇతర వర్షాధార పంటలకు మారాలని తాము సూచించినట్లు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త ఎన్డీఆర్కే శర్మ చెప్పారు. రాబోయే కరవు పరిస్థితుల్లో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, భూగర్భ జలాలను సంరక్షించడానికి బిందు సేద్యం, తుంపర సేద్యం వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను అనుసరించాలని ఆయన కోరారు. రైతులు భూగర్భ జలాలను అధికంగా తోడటాన్ని నివారించాలని ఆయన సూచించారు.
►ALSO READ | నిమ్మకాయ తొక్కలు పడేస్తున్నారా..? ఇలా చేస్తే సూపర్ క్లీనింగ్ లిక్విడ్ రెడీ!
అడుగంటిన భూగర్భజలాలు
రాష్ట్రంలోని 64 మండలాల్లో భూగర్భజలాలు అడుగంటాయని తాజాగా జులై నెలలో జరిపిన పరిశీలనలో వెల్లడైందని భూగర్భజలశాఖ సహాయ సంచాలకులు గోవర్థన్ చెప్పారు. 56 మండలాల్లో భూగర్భజలాల నీటిమట్టం గణనీయంగా తగ్గిందని,15–30 మీటర్ల లోతులోకి భూగర్భజలం పడిపోయిందని ఆయన వివరించారు. మన రాష్ట్రంలో శంకరంపేట, నర్సాపూర్, మల్కాజిగిరి, నిజామాబాద్, సంగారెడ్డి, బాలానగర్, చేవెళ్ల, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, అమీర్‌పేట్, బాచుపల్లి.. ఇలా అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు ప్రమాదస్థాయిలో అడుగంటాయని తాజాగా వెల్లడైంది.
రీచార్జి గుంత నిర్మాణం
వర్షపునీరు భూమిలో ఇంకేందుకు వీలుగా నగరాలు, పట్టణాల్లోని ఇళ్లలో రీచార్జి గుంతలను తవ్వుకోవాలని భూగర్భ జలశాఖ డైరెక్టర్ కె. లక్ష్మా సూచించారు. ఇళ్లలో బోర్ల సమీపంలో15 మీటర్ల లోతు గుంత తవ్వి చుట్టూ ఇటుకలు, సిమెంటు, ఇసుకతో గోడ నిర్మించి రీచార్జి పిట్‌ను సిద్ధం చేసుకోవాలి. ఈ గుంతలో 50 శాతం మేర 40 మిల్లీమీటర్ల గులకరాళ్లు వేయాలి. ఆపై 25 శాతం మేర 20 మిల్లీమీటర్ల సైజు గల గులకరాళ్లతో నింపాలి. పైన మరో15 శాతం దొడ్డు ఇసుకను వేయాలి.
స్లాబు మీద పడే వర్షపునీరు పైపు ద్వారా ఇంకుడు గుంత దగ్గరకు వచ్చేలా చేసి పైన నీళ్లు చిందకుండా ఉండేలా కొబ్బరి పీచుతో చేసిన దిండును పెట్టాలి. ఇలా ఇంటి పైకప్పుపై పడిన వర్షపు నీటిని ఇంకుడు గుంత ద్వారా భూగర్భ జలాలను రీచార్జి చేసుకోవచ్చు. వర్షపునీటిని కందకం ద్వారా కూడా గ్రౌండ్ వాటర్ మట్టాన్ని పెంచుకోవచ్చు. ఇంటి గార్డెన్ లో వర్షపునీటిని రీచార్జి చేసేందుకు గుంత తవ్వి అందులో రాళ్లు, గ్రావెల్, ఇసుక నింపితే భూగర్భనీటి మట్టం పెరుగుతుంది. ఇలా ఇళ్లలోని శిథిలమైన పురాతన బావులను రీచార్జి ఇంకుడు గుంతలుగా మార్చుకోవచ్చు.
స్వచ్ఛంద సంస్థల వినూత్న కార్యక్రమాలు
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ అంతటా వర్షపునీటి సంరక్షణ, భూగర్భజలాల పెంపు, వాటర్ షెడ్ అభివృద్ధి పనులను కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్నాయి. అందులో భాగంగా ‘వాసన్’ అనే స్వచ్ఛంద సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో వాటర్‌షెడ్ అభివృద్ధి, వర్షాధార వ్యవసాయం, భూసార పరిరక్షణ కార్యక్రమాలను చేపట్టింది. ఈ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌లో మెట్రో వాటర్ బోర్డు సహకారంతో వందలాది రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టారు.
‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్’ పట్టణ ప్రాంతాల్లో రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్, మొక్కల పెంపకం, పర్యావరణ విద్యపై ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. ‘యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్’ కార్పొరేట్ సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలు, గ్రామాల్లో రీచార్జ్ పిట్లు, నీటి సంరక్షణ ప్రాజెక్టులు చేపడుతోంది. ‘ప్రకృతి ఎన్విరాన్‌మెంట్ సొసైటీ’ ప్రజల్లో అవగాహన ర్యాలీలు, శిక్షణ శిబిరాలు, ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రచారం నిర్వహిస్తోంది.
ఈ రోజు ఒడిసిపట్టిన ప్రతి నీటి బొట్టు రేపటి తరాలకు జీవన భద్రతను అందించే అమూల్యమైన పెట్టుబడి. నీటిని కాపాడటం కేవలం పర్యావరణ బాధ్యత కాదు.. దేశ భవిష్యత్తును కాపాడే సామూహిక కర్తవ్యం.
వర్షపునీటి సంరక్షణే మార్గం
వర్షపాతం ఉన్నచోట రీచార్జ్ గుంతలు, ఇంకుడు ట్యాంకులు, చెక్ డ్యామ్‌లు, వ్యవసాయ చెరువులు లాంటి సరైన భూగర్భ జల రీఛార్జ్ నిర్మాణాలను నిర్మించుకోవాలని తెలంగాణ భూగర్భజల శాఖ డైరెక్టర్ కె లక్ష్మా కోరారు. వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా వర్షపాత లోటు కాలంలో భూగర్భ జల వనరుల సుస్థిరతను నిర్ధారించ వచ్చన్నారు. పట్టణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవన చర్యలు చేపట్టాలి.
వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయడానికి, నీటి వినియోగదారులు, గృహాలు తమ ఇంటి పైకప్పులపై వర్షపు నీటిని సేకరించే నిర్మాణాలను నిర్మించుకోవాలని ఆయన సూచించారు. నీటి వనరులు కలుషితం, కాలుష్యం కాకుండా ఉన్నచోట బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు, రీచార్జ్ పిట్‌లు, ఇంజెక్షన్ బావులను నిర్మించుకోవాలని కోరారు. బహిరంగ ప్రదేశాలు, పార్కులు, నివాస లేఅవుట్‌లలో ఇంకుడు గుంతలు, రీచార్జ్ కందకాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
గ్రామాల్లో ట్రెంచ్‌ల తవ్వకం
గ్రామీణ ప్రాంతాల్లో నీటి ప్రవాహాన్ని తగ్గించడానికి, నేలలో తేమను పెంచడానికి, భూగర్భ జలాల నీటిమట్టాలను మెరుగుపరచడానికి అనువైన ప్రాంతాల్లో ట్రెంచ్ (సమతల కందకాలు)లు నిర్మించుకోవాలని భూగర్భ జలశాఖ అధికారులు చెప్పారు. చిన్న ఇంకుడు గుంతలు నిర్మించొచ్చు. పొలాల్లో భూగర్భ జలాల మట్టాలు పెంచేందుకు వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయడానికి ఫాం పాండ్స్ నిర్మించుకోవాలని సూచించారు.
నీటి ప్రవాహాన్ని అరికట్టడానికి, భూగర్భ జలాల పునరుత్పత్తిని మెరుగుపరచడానికి అనువైన మురుగునీటి మార్గాలకు అడ్డంగా చెక్ డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు, వదులైన బండరాళ్ల నిర్మాణాలను నిర్మించుకోవాలి. నేలలోని తేమను సంరక్షించడానికి, ఉపరితల నీటి ప్రవాహాన్ని తగ్గించడానికి పొలాలకు సమతల గట్లు వేయడాన్ని ప్రోత్సహించాలి.
రీచార్జ్ ఇంజెక్షన్ బోర్ వెల్
వర్షపునీరు వృథా కాకుండా ఇంజక్షన్ వెల్ ద్వారా భూగర్భజలాలను రీచార్జ్ చేయొచ్చు. పెద్ద గుంత తవ్వి అందులో 50 శాతం 40 మిల్లీమీటర్ల సైజు రాళ్లతో నింపాలి. ఆ తర్వాత 25 శాతం 25 మిల్లీమీటర్ల సైజు గులకరాళ్లతో నింపాలి. ఆ తర్వాత 15 శాతం ఇసుకను నింపి, పై భాగంలో 10 శాతం గుంత ఖాళీగా ఉంచాలి. దీంతో వర్షపు నీరంతా ఈ ఇంజక్షన్ వెల్ ద్వారా భూమిలో ఇంకుతాయి.
చెక్ డ్యామ్‌ల నిర్మాణం
పొలాల్లో పారుతున్న చిన్న చిన్న వాగులపై చెక్ డ్యామ్ లు నిర్మించడం ద్వారా వర్షపు నీటిని భూగర్భంలోకి పంపిస్తే భూగర్భ జలమట్టం పెరుగుతుంది. చెక్ డ్యామ్ దగ్గర వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల ఆ ప్రాంతంలో భూగర్భజలాలు పైకి వస్తాయి. వాగులో చెక్ డ్యామ్‌లు నిర్మించే స్థలాల దగ్గర నీరు భూగర్భంలో ఇంకేలా రీచార్జ్ షాఫ్ట్ నిర్మించుకోవచ్చు.
