సాధారణంగా పదవ తరగతి చదివే విద్యార్థులు బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి తెగ కష్టపడుతుంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 14 ఏళ్ల కందుల జెస్సీ మాత్రం పరీక్షలతో పాటు ఏకంగా అంతరిక్ష పరిశోధనల్లో అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ అయిన 'శక్తిశాత్' (Shaktisat) ప్రాజెక్ట్‌కు ఈ తెలుగు తేజం ఎంపికైంది.
పేదరికాన్ని జయించి..
ఆంధ్రప్రదేశ్‌లోని ధవలేశ్వరానికి చెందిన జెస్సీ ఒక సాధారణ పేద కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి వడ్రంగిగా (కార్పెంటర్) పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ప్రైవేట్ స్కూల్ నుంచి తీసి, ఆమెను స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో (ZPGHS) చేర్పించారు. అయితే, ఏ ప్రభుత్వ బడి అయితే ఆమెను చేర్చుకుందో.. అదే బడి ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టింది.
ఉపాధ్యాయురాలి చొరవ..
జెస్సీ చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. ముఖ్యంగా సైన్స్ అంటే ఆమెకు మమకారం. ఆమెలోని ప్రతిభను గుర్తించిన ఫిజిక్స్ టీచర్, అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్‌చార్జ్ మణిమల.. ఈ 'శక్తిశాత్' మిషన్ కోసం జెస్సీ పేరును నమోదు చేశారు. అయితే అప్పటికే కోర్సు ప్రారంభం కావడంతో మొదట్లో ఇబ్బంది ఎదురైనా, ఉపాధ్యాయుల కృషితో ఆమెకు అవకాశం దక్కింది. ఆ తర్వాత జెస్సీ పగలు, రాత్రి కష్టపడి ఈ మిషన్‌లో స్థానం సంపాదించుకుంది.
108 దేశాల అమ్మాయిలను ఓడించి..
ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల నుంచి 1200 మందికి పైగా విద్యార్థులు ఈ మిషన్ కోసం పోటీ పడ్డారు. వీరిలో భారత్ నుంచి కేవలం 20 మంది విద్యార్థినులను మాత్రమే ఎంపిక చేయగా.. అందులో మన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జెస్సీ ఒకరు కావడం విశేషం.
సవాళ్లను ఎదుర్కొంటూ..
పదో తరగతి బోర్డు పరీక్షలకు చదువుకుంటూనే, మరోవైపు ఆన్‌లైన్ క్లాసెస్ హాజరైంది. ఈ కోర్సులో భాగంగా సాటిలైట్ సిస్టమ్స్, స్పేస్ టెక్నాలజీ వంటి 21 మాడ్యూల్స్, 550 సెషన్లు ఉన్నాయి. స్కూల్ సిలబస్‌కు ఇది చాలా దూరంగా ఉన్నా, పట్టుదలతో నేర్చుకుంది.
ఆన్‌లైన్ పరీక్షలు, శాస్త్రవేత్తలతో ఇంటర్వ్యూలు, వీడియో ప్రెజెంటేషన్లలో జెస్సీ తన టీచర్లు, ఆన్‌లైన్ వీడియోల సాయంతో ఇంగ్లీష్ మాట్లాడటం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసింది.
భవిష్యత్తులో ఇస్రో (ISRO)లో శాస్త్రవేత్తగా దేశ అంతరిక్ష కార్యక్రమంలో భాగం కావడమే తన లక్ష్యమని జెస్సీ చెబుతోంది. కష్టాలను మెట్లుగా మలచుకుని అసాధారణ విజయం సాధించిన ఈ చిన్నారి ప్రయాణం ఎంతోమందికి ఆదర్శం స్ఫూర్తిదాయకం.
