అడవుల్లో పులుల అడుగుజాడలను అనుసరిస్తూ.. వేటగాళ్ల ఉచ్చులను తొలగిస్తూ.. పులుల ఆవాసాలను కాపాడేందుకు యువతతో కలిసి 25 ఏళ్లుగా నిశ్శబ్దంగా సేవలందిస్తోంది ‘హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (హైటికాస్)’. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఈ ‘టైగర్ హీరోల’ సేవలపై స్పెషల్ స్టోరీ.
హైదరాబాద్కు చెందిన ఇమ్రాన్ సిద్ధిఖీ బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో జీవశాస్త్రంలో పట్టా పొంది తన సోదరుడైన ఆసిఫ్ సిద్ధిఖీతో కలిసి పులులంటే ఇష్టంతో అడవి బాట పట్టారు. వాళ్లు హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీని (హైటికాస్ ) ఏర్పాటు చేసి రెండున్నర దశాబ్దాలుగా పులుల సంరక్షణ కోసం విశేష కార్యక్రమాలు చేపడుతున్నారు.
తెలంగాణలో అంతరించిపోతున్న పులులను సంరక్షించి, భవిష్యత్ తరాల కోసం అందించాలనే లక్ష్యంతో ఈ సొసైటీ కార్యక్రమాలు చేపడుతోంది. రెండున్నర దశాబ్దాలకు పైగా క్షేత్రస్థాయి అనుభవంతో భవిష్యత్తు కోసం పర్యావరణాన్ని కాపాడటంతోపాటు ప్రజలు, పులులు, వన్యప్రాణుల మధ్య సహజీవనాన్ని ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నామని హైటికాస్ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్ సిద్ధిఖీ చెప్పారు.
వేట నిరోధక గస్తీ
అడవుల్లో పులులను వేటాడేందుకు ఏర్పాటుచేసిన ఉచ్చులను, వేట కోసం ఉపయోగించే అక్రమ విద్యుత్ లైన్లను తొలగించడంలో తమ బృందంపాటు పడిందని ఆయన పేర్కొన్నారు. గతేడాది హైటికాస్ టీం సభ్యులు అడవుల్లో పాదయాత్ర ద్వారా 5,271 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ,1,284 వేట నిరోధక గస్తీ నిర్వహించారు.
►ALSO READ | రూ.500 వీకెండ్ ఛాలెంజ్..! చేతిలో ఐదొందలు ఉంటే హైదరాబాద్‌లో వీకెండ్ తిని తిరగొచ్చు.. ఎలా అంటే..
ఈ టీం 2024 – 25 సంవత్సరంలో ఏడు జిల్లాల్లో 2,426 కిలోమీటర్ల మేర 2 వేల చదరపు కిలోమీటర్లకు పైగా ఆవాసాల్లో తొమ్మిది పులులను పర్యవేక్షించింది. క్షేత్రస్థాయి సర్వేలు,72 కెమెరా ట్రాప్‌ల ద్వారా 218 ప్రదేశాల్లో పులుల ఉనికిని నమోదు చేశారు.
చిరుతల సంరక్షణకు కార్యక్రమాలు
హైటికాస్ పులులే కాకుండా చిరుతల సంరక్షణ కార్యక్రమాలను చేపట్టింది. కామారెడ్డిలో మానవ- వన్యప్రాణుల సంఘర్షణను తగ్గించడంపై దృష్టి సారించి లివింగ్ లెపర్డ్స్, లిటిల్ అంబాసిడర్స్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ కార్యక్రమాలను చేపట్టింది.
కవాల్ అభయారణ్యంలో జీవవైవిధ్యంపై ప్రభావాలను అంచనా వేయడానికి భూభాగ మార్పులపై అధ్యయనం చేశారు. హైదరాబాద్‌లో ప్రారంభమై తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న లాస్ట్ అర్బన్ నాచురల్ గ్రీన్ స్పేసెస్ పథకం ద్వారా పట్టణాల్లోని హరిత ప్రాంతాలను మ్యాపింగ్ చేశారు.
2001వ సంవత్సరం నుంచి అటవీ శాఖ సహకారంతో పులుల పర్యవేక్షణ, క్షీరదాల ఆవాస సర్వేలు, ఆహార జంతువుల పర్యవేక్షణ, జన్యు అనుసంధానానికి మద్దతుగా వన్యప్రాణుల కారిడార్ల మ్యాపింగ్ కార్యక్రమాలను చేపట్టారు. పోచారం ప్రాంతంలో మానవ-చిరుతల సహజీవనంపై ప్రాథమిక అధ్యయనం చేశారు. కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాంతంలోని అడవులు, పొలాలు, పచ్చిక బయళ్లలో చిరుతల మనుగడపై నివేదిక రూపొందించారు.
రోడ్డు ప్రమాదాలు
వన్యప్రాణులు రోడ్లను దాటుతుండగా వేగంగా వచ్చే వాహనాలు ఢీకొని మరణిస్తున్న నేపథ్యంలో దీనిపై హైటికాస్ టీం సర్వేలు చేపట్టింది. వన్యప్రాణులకు అధిక ప్రమాద ప్రాంతాలను గుర్తించడానికి రోడ్‌కిల్ పర్యవేక్షణను చేపట్టింది. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే జంతువుల తీరు, ప్రభావితమైన జాతులు, కాలక్రమేణా వాటిలో వచ్చే మార్పులను నమోదు చేయడం ద్వారా సూచిక బోర్డులు, అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
హైటికాస్ అహోబిలం, అమ్రాబాద్ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన జంతువులపై సర్వేలను నిర్వహించింది. 2024 ఆగస్టు నుంచి 2025 మార్చి మధ్య అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో 274 వన్యప్రాణులు రోడ్డు ప్రమాదాల్లో మరణించాయని ఈ సర్వేల్లో వెల్లడైంది.
యువత అడవి బాట
ఉన్నత విద్యావంతులైన యువతీ, యువకులు పులుల పరిరక్షణ కోసం హైటికాస్ బృందంలో చేరి అడవి బాటపట్టారు. అడవుల పరిరక్షణ, పులుల సంరక్షణ కోసం ఫీల్డ్ కో–ఆర్డినేటర్ల నుంచి ఫీల్డ్ బయాలజిస్ట్‌లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వాలంటీర్లు అటవీశాఖ ఉద్యోగులు, అధికారులతో కలిసి అడవుల్లోని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు.
ఫీల్డ్ కో–ఆర్డినేటర్లుగా కవాల పులుల అభయారణ్యంలో డాక్టర్ వెంకట్ డేగా, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో గజ్జెల బాపురెడ్డి, ఫీల్డ్ బయాలజిస్ట్, రీసెర్చ్ అసోసియేట్లుగా అఖిల్ గౌడ్, కె. శ్రీకాంత్, ఇమ్మాన్యుయేల్ సంపత్ ఉన్నారు.
గుండాల అటవీ కమ్యూనిటీ రిలేషన్స్ ఆఫీసర్గా బొడ్డు కుమార్, గుండాల ప్రాజెక్ట్ కో– ఆర్డినేటర్‌గా ప్రేమ్ కుమార్, అడ్మినిస్ట్రేషన్ మేనేజర్‌గా కె. రేవతి, నిధుల సేకరణ, కార్యక్రమాలు, భాగస్వామ్యాల సమన్వయకర్తగా, లాస్ట్ అర్బన్ నేచురల్ గ్రీన్ స్పేసెస్ నిర్వాహకురాలిగా ఫరిహా ఫాతిమా సేవలందిస్తున్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్లుగా అటవీ గ్రామాలకు చెందిన శంకరయ్య, భీమరావు, ప్రశాంత్, తదితరులు అడవుల్లో తిరుగుతూ పులుల పరిరక్షణ కోసం పనిచేస్తున్నారు. పులుల సంరక్షణ ప్రయాణంలో వాలంటీర్లుగా దేవన్య, శ్రీపతి వైష్ణవ్, వడ్లూరి రాంబాబు, సాయితేజ వంటివాళ్లు ముందుకు సాగుతున్నారు.
వీకెండ్‌లోనూ పులుల కోసం..
ఐటీ ఉద్యోగి శ్రీపతి వైష్ణవ్ వీకెండ్లలో హైటికాస్ వాలంటీర్‌గా పనిచేస్తున్నారు. మహారాష్ట్రలోని తాడోబా నుంచి తెలంగాణలోకి వచ్చిన ‘సిర్పూర్–12’ పులి కదలికలను అటవీ శాఖతో కలిసి ట్రాక్ చేసిన అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కవాల్ అభయారణ్యంలో వేటగాళ్ల కార్యకలాపాలు పులులకు ముప్పుగా మారుతున్నాయని, సంరక్షణ చర్యలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యం నుంచి తెలంగాణ అడవుల్లోకి వలస వచ్చిన సిర్పూర్12 పులి ఆవాసం వెతుక్కుంటూ నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, సిద్ధిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో సంచరించిందని దీని కదలికలపై తాను అటవీశాఖ అధికారులతో కలిసి ట్రాక్ చేశానని వైష్ణవ్ తెలిపారు. వేటగాళ్ల నిర్వాకం వల్ల కవాల టైగర్ రిజర్వులో పులుల సంఖ్య తగ్గుతోందని, దీన్ని పరిరక్షించేందుకు రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.
హైటికాస్ హీరోలు
హైటికాస్ టీం తెలంగాణ రాష్ట్రం పరిధిలోని దక్కన్ టైగర్ కారిడార్‌లో కవాల్ టైగర్ రిజర్వ్, నల్లమల అడవుల్లో విస్తరించిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, గుండాల ల్యాండ్‌స్కేప్, నాగార్జునసాగర్, -శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో పులులు, వన్యప్రాణుల పర్యవేక్షణ, ఆహార లభ్యత అంచనాలు, ముప్పుల మూల్యాంకనం, అటవీ, బఫర్ జోన్లలో పులుల ఆవాస వినియోగం, జాతుల ఉనికిని గుర్తించి వాటి పరిరక్షణ కోసం పలు కార్యక్రమాలు చేపడుతోంది.
దీంతో పాటు హైదరాబాద్‌లో పట్టణ జీవవైవిధ్య పరిరక్షణ కోసం కార్యక్రమాలు చేపడుతోంది. 2001 నుంచి వార్షిక పులుల గణన కార్యకలాపాలు, క్షేత్రస్థాయి సర్వేలు చేపట్టింది. ఈ టీం సభ్యులు పులులు ఇతర జంతువుల పాదముద్రలు, మలం, అరుపులు వంటి ప్రత్యక్ష, పరోక్ష సంకేతాలను నమోదుచేశారు.
అంతర్జాతీయ పులుల దినోత్సవం
ప్రతి సంవత్సరం జులై 29న జరుపుకునే అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా హైటికాస్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ కార్యక్రమంలో13 పాఠశాలల నుంచి 700 మంది విద్యార్థులను భాగస్వాములను చేసింది. విద్యార్థులకు పులుల సంరక్షణ, అటవీ పర్యావరణ వ్యవస్థలు, వన్యప్రాణుల ఆవాసాలను రక్షించడంపై అవగాహన ఏర్పరచింది. పులులు మాంసాహారులుగా పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి సాయపడుతున్నాయి.
అడవులు ఉంటేనే పులులు.. పులులు ఉంటేనే ఆరోగ్యకరమైన అటవీ పర్యావరణ వ్యవస్థ నిలుస్తుంది. పులిని కాపాడటం అంటే ఒక జాతిని మాత్రమే కాదు, మొత్తం జీవవైవిధ్యాన్ని, అడవులను, నీటి వనరులను, చివరికి మనిషి భవిష్యత్‌ను కాపాడినట్లేనని హైటికాస్ సభ్యులు చెప్తున్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా పులుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వాలకే పరిమితం కాదని, ప్రకృతిని ప్రేమించే ప్రతి పౌరుడు భాగస్వామి కావాల్సిన అవసరం ఉందని వారు పిలుపునిస్తున్నారు.
