హైదరాబాద్‌ లో హార్స్ రైడింగ్ జోష్... ఆగస్టులో హెచ్‌‌ పీఆర్‌‌ సీ ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ –2026

హైదరాబాద్‌ లో హార్స్ రైడింగ్ జోష్... ఆగస్టులో హెచ్‌‌ పీఆర్‌‌ సీ ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ –2026

హైదరాబాద్ నగరంలో హార్స్ రైడింగ్ జోష్ పెరుగుతోంది. ఫిట్‌నెస్, ఫోకస్, థ్రిల్ కోసం గుర్రపు స్వారీపై యువతీ, యువకులు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ పొలో రైడింగ్ క్లబ్ ఈక్వెస్టేరియన్ చాలెంజ్ 2026 పోటీలు ఆగస్టు నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో నగరంలో హార్స్ రైడింగ్ క్లబ్ లు యువతతో సందడిగా మారాయి.

ఒకప్పుడు గుర్రపు స్వారీ అంటే సైన్యం, పోలీసులు, రాజకుటుంబాలు లేదా పోలో క్రీడాకారులకు మాత్రమే పరిమితమనే భావన ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. సిటీలో గుర్రపు స్వారీ ఓ కొత్త లైఫ్‌‌ స్టైల్ స్పోర్ట్‌‌గా రూపుదిద్దుకుంటోంది. 
యూత్​ ఆసక్తికి తగ్గట్టే హార్స్ రైడింగ్​లో శిక్షణ ఇచ్చి చాంపియన్లుగా తీర్చిదిద్దేందుకు నగర శివారు ప్రాంతంలోని అజీజ్ నగర్​లోని ‘హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్’ విశేష కృషి చేస్తోంది. 

ప్రపంచ స్థాయి సౌకర్యాలు, వృత్తిపరమైన శిక్షణ ద్వారా అశ్వ క్రీడలు, గుర్రపు స్వారీని ప్రోత్సహించడంలో ఈ క్లబ్ అగ్రగామిగా నిలిచింది. గుర్రపు స్వారీ హార్స్ రైడర్స్​లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమతుల్యత, ఏకాగ్రత, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుంది. ఎవరైనా వినోదం కోసం గుర్రపు స్వారీ చేయాలనుకున్నా లేదా అశ్వ క్రీడలను వృత్తిగా చేపట్టాలనుకున్నా హెచ్.పీ.ఆర్.సీ సరైన వేదికను అందిస్తుందని క్లబ్ కార్యదర్శి రియాజ్ అహ్మద్ చెప్పారు.

అనుభవజ్ఞులైన శిక్షకుల పర్యవేక్షణలో..

మొదట బిగినర్స్​కు గుర్రాన్ని ఎలా పట్టుకోవాలి? దానిని ఎలా శుభ్రం చేయాలి? భద్రతా పద్ధతులు, గుర్రం ఎక్కే విధానం, శరీర భంగిమ, బ్యాలెన్స్ గురించి పరిచయం చేస్తారు. ఈ శిక్షణ వల్ల రైడర్లకు ఆత్మవిశ్వాసంతోపాటు అత్యున్నత భద్రతా ప్రమాణాల గురించి ఎక్స్​పీరియెన్స్​డ్​ కోచ్​లు​ చెప్తారు. పిల్లలు, విద్యార్థులు, ఉద్యోగులు, పెద్దలు, అనుభవం ఉన్నా లేకపోయినా గుర్రపు స్వారీని నేర్చుకోవచ్చని క్లబ్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ చెప్పారు.

అశ్వక్రీడల్లో విభాగాలెన్నో...

హార్స్ రైడింగ్ శిక్షణలో పలు విభాగాలున్నాయి. వినోదాత్మక గుర్రపు స్వారీ, గుర్రం, రైడర్ మధ్య కచ్చితత్వం, సమతుల్యతతో చేసే రైడింగ్​ను ‘డ్రెస్సేజ్’ అంటారు. వేగం, చురుకుదనం, కచ్చితత్వం, నైపుణ్యాన్ని పరీక్షించే ఉత్తేజకరమైన క్రీడా విభాగాన్ని ‘షో జంపింగ్’ అంటారు. అసాధారణమైన గుర్రపు స్వారీ నైపుణ్యంతో ఆడే చారిత్రాత్మకమైన అశ్వ క్రీడను ‘పోలో’ అంటారు. ఇటీవల అశ్వ క్రీడల్లో షో జంపింగ్ గణనీయమైన వృద్ధిని సాధించిందని ఈక్వెస్ట్రియన్ కోచ్‌‌లు చెప్పారు.

►ALSO READ | సోషల్ మీడియా ఆఫర్ల మాయ..! మోసపోకుండా ఎలా జాగ్రత్త పడాలంటే..!

హార్స్ రైడింగ్ ప్రోగ్రామ్​లు..

కొత్తగా వచ్చే వారి కోసం బేసిక్ హార్స్ రైడింగ్ నుంచి పోటీ స్థాయి శిక్షణ వరకు ప్రత్యేక ప్రోగ్రామ్‌‌లు అందుబాటులో ఉన్నాయి. స్టార్ట్ రైడింగ్ ప్రోగ్రామ్, ఇంటర్మీడియట్ రైడింగ్, అడ్వాన్స్‌‌డ్ పోలో ప్రోగ్రామ్, ఈక్వెస్టేరియన్ ట్రైనింగ్, స్టిక్ అండ్ బాల్ సెషన్స్, చుక్కర్స్ ప్రాక్టీస్, రైడ్ స్మార్ట్ ప్రోగ్రామ్ శిక్షణ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల్లో గుర్రంతో అనుబంధం పెంచుకోవడం, సమతుల్యత, రైడింగ్ టెక్నిక్స్, భద్రతా నియమాలు, పోలో బేసిక్స్​ వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. 

హార్స్ రైడింగ్ నేర్చుకోవడం వల్ల తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని నగరానికి చెందిన టి. నాగనాథ్ అనే హార్స్ రైడర్ చెప్పారు. ఉదయం 6 నుంచి10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు హార్స్ రైడింగ్ శిక్షణ తరగతులను రైడింగ్ క్లబ్​లు నిర్వహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అశ్వశిక్షణా సంఘం సహకారంతో షో జంపింగ్, డ్రెస్సేజ్, టెంట్ పెగ్గింగ్ శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు.

ఎన్నెన్నో హార్స్ రైడింగ్ క్లబ్ లు

హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ అజీజ్ నగర్ సమీపంలో10 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ క్లబ్​ 50 గుర్రాలతో అన్ని వయసుల సభ్యులకు శిక్షణ ఇస్తుంది. రాయల్ కేబల్లో క్లబ్ గుర్రపు స్వారీ పాఠశాలగా గుర్తింపు పొందింది. మణికొండలోని చాంపియన్స్ హార్స్ రైడింగ్ క్లబ్, జన్వాడలో నస్ర్ పోలో, గుల్షన్ కాలనీలో హైదరాబాద్ హార్స్ రైడింగ్ స్కూల్, ద హైదరాబాద్ ఈక్వెస్ట్రియన్ సెంటర్, కిస్మస్ పూర్​లోని హైదరాబాద్ ఈక్వెస్ట్రియన్ క్లబ్, తెలంగాణ హార్స్ రైడింగ్ అకాడమీ, కేతిరెడ్డిపల్లి లోని హైదరాబాద్ హార్స్ అడ్వెంచర్, తెలంగాణ పోలో క్లబ్, హైదరాబాద్ హార్స్ రైడింగ్ క్లబ్, ఈక్విన్ హార్స్ రైడింగ్ స్పోర్ట్స్, నవీన్ ఫార్మ్స్ హార్స్ రైడింగ్ స్కూల్, హైదరాబాద్ రేస్ క్లబ్, లార్వెన్ హార్స్ రైడింగ్ క్లబ్, ఆర్చి హార్స్ రైడింగ్ అకాడమీ, గ్రేట్ హార్స్ రైడింగ్ అకాడమీ, రాంచీ డి కబెల్లోస్, స్టాల్లిన్ హార్స్ రైడింగ్ అకాడమీలు హార్స్ రైడర్స్​తో సందడిగా మారాయి.  

ఖర్చు, సంరక్షణ.. సవాళ్లూ ఉన్నాయి..

గుర్రాల సంరక్షణ, మైదానాల నిర్వహణ, శిక్షణ పరికరాలు, భద్రతా ప్రమాణాల కారణంగా హార్స్ రైడింగ్ ఖర్చుతో కూడుకున్న క్రీడగా భావిస్తున్నారు. అయినప్పటికీ నాణ్యమైన శిక్షణ కోసం యువత ముందుకు వస్తోందని క్లబ్ నిర్వాహకులు చెప్తున్నారు.

హెచ్‌‌పీఆర్‌‌సీ ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ –2026

గుర్రపు స్వారీ క్రీడలను ఇంకా ఎక్కువగా ప్రోత్సహించడానికి, రైడర్‌‌లకు క్రమం తప్పకుండా పోటీలలో పాల్గొనే అవకాశాన్ని కల్పించడానికి హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ ఇటీవల హెచ్‌‌పీఆర్‌‌సీ ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ అనే ఒక కొత్త పోటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి రైడర్‌‌లు, గుర్రపు స్వారీ ఔత్సాహికుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.ఈ పోటీలు ఔత్సాహిక రైడర్‌‌లు, పోటీ గుర్రపు స్వారీ క్రీడాకారులు వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి వేదిక కానుంది. 

ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ ఎడిషన్ ఆగస్టు 14, 15, 16 తేదీల్లో జరగనుంది. ఇందులో వివిధ వయస్సులవారు, నైపుణ్య స్థాయిల రైడర్‌‌లు వివిధ గుర్రపు స్వారీ ఈవెంట్లలో పాల్గొంటారని రైడింగ్ క్లబ్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ చెప్పారు.

ఫిట్‌నెస్‌ తో పాటు..

గుర్రపు స్వారీ కేవలం అడ్వెంచర్ స్పోర్ట్ మాత్రమే కాదు. శరీర సమతుల్యత, కోర్ మజిల్స్ బలోపేతం, ఏకాగ్రత, నిర్ణయ సామర్థ్యం, ఆత్మవిశ్వాసం పెరగడంలో ఇది సాయపడుతుందని కోచ్‌లు చెప్తున్నారు. గుర్రంతో సమన్వయం, సహనం, క్రమశిక్షణ కూడా ఈ క్రీడలో కీలకమని వారు పేర్కొంటున్నారు. 

హార్స్ రైడింగ్ ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికల్లో వైరల్ అవుతుండటంతో యువతలో ఆసక్తి మరింత పెరిగింది. వీకెండ్ హాబీగా ప్రారంభించిన వారు ఇప్పుడు పోలో, షో జంపింగ్ వంటి ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో పాల్గొనే దిశగా అడుగులు వేస్తున్నారు.