రైనీ సీజన్స్టాటయింది. భారీగా వానలు పడకపోయినా .. చిరు జల్లులు పడుతున్నాయి. చిటపట చినుకులు పడుతూ ఉంటే.. వేడివేడిగా బజ్జీలు తింటుంటే . ఆ మజానే వేరుగా ఉంటుంది కదా..ఎప్పుడు మిర్చి బజ్జీ.. పకోడి అంటే బోరు కొడుతుంది... అందుకే మీకోసం వెరైటీ బజ్జీల్ని తెచ్చేశాం. ఆరోగ్యం.. ఇమ్యూనిటి పవర్ పెంచే ఆకులు, కూరగాయలు, పండ్లతో చేసిన ఈ బజ్జీలు తింటే ఆరోగ్యానికి.. ఆరోగ్యం.. రుచికి .. రుచి ఉంటాయి. ఇప్పుడు అలాంటి బజ్జీలను తయారు చేయడానికి ఏఏ పదార్థాలు కావాలి.. ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
బీరకాయ బజ్జీ తయారీకి కావాల్సినవి
- బీరకాయ - ఒకటి
- శెనగపిండి-రెండు కప్పులు
- బియ్యప్పిండి- రెండు టేబుల్ స్పూన్లు
- ఉప్పు- తగినంత
- కారం- ఒక టీస్పూన్
- వంటసోవా- చిటికెడు
- వాము - అరటీస్పూన్
బీరకాయ బజ్జీ తయారీ విధానం
ముందుగా బీరకాయ తొక్కతీసి పలుచని గుండ్రటి ముక్కలుగా కట్ చేయాలి. ఒక గిన్నెలో శెనగపిండి, బియ్యప్పిండి, కారం, వాము, వంటసోడా వేసి జారుగా కలపాలి. శెనగపిండి మిశ్రమంలో ఒక్కో బీరకాయ ముక్కని ముంచి కాగే నూనెలో వేసి వేగించాలి. వీటిని అలాగే అయినా తినేయొచ్చు లేదా నచ్చిన చట్నీ అద్దుకుని తింటే రుచి అదిరిపోతుంది.
వామాకు బజ్జీలు తయారీకి కావాల్సినవి
- శెనగపిండి- ముప్పావు కప్పు
- వంటసోడా కొంచెం
- బియ్యప్పిండి- పావుకప్పు
- ఇంగువ-కొద్దిగా
- ఉప్పు, కారం- సరిపడా
- ధనియాల పొడి - ఒక టీ స్పూన్
వామాకు బజ్జీలు తయారీ విధానం
వామాకుల్ని శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో శెనగపిండి, బియ్యప్పిండి, ఇంగువ, ఉప్పు, కారం,ధనియాల పొడి, వంటసోడా వేయాలి. ఇందులో సరిపడా నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలపాలి. ఇప్పుడు ఒక్కో ఆకుని ముంచి మరుగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేస్తే వేడివేడి వామాకు బజ్జీలు రెడీ.. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇవి తినడం వలన గ్యాస్ సమస్య రాదు.. అజీర్తి లాంటి వ్యాధులకు మంచి ఔషధం కూడా.. వీటిని వద్దన్నా పిల్లలు .. పెద్దలు ఇష్టంగా తింటారు.
చికెన్ బజ్జీ తయారీకి కావలసినవి
- బోన్ లెస్ చికెన్- 200 గ్రాములు
- బజ్జీ మిర్చి- పది
- పసుపు-చిటికెడు
- కారం- కొద్దిగా
- కరివేపాకు- ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు, నూనె- తగినంత
- మైదా- అర కప్పు
- ఉల్లిగడ్డ తరుగు-- రెండు టీ స్పూన్లు
- గరం మసాలా- కొద్దిగా
- కొత్తిమీర- అర కప్పు
చికెన్ బజ్జీ తయారీ విధానం
ప్రెషర్ పాన్ లో కొద్దిగా నూనె వేడిచేసి ఉల్లిగడ్డ తరుగు, చికెన్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు, కొత్తమీర, కరివేపాకు వేసి వేగించాలి. కాసేపయ్యాక. అందులో కొద్దిగా నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టప్ ఆపేయాలి. తర్వాత మైదాపిండిలో కొద్దిగా ఉప్పు వేసి నీళ్లుపోసి పూరీ పిండిలా కలపాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకుని పూరీల్లా వత్తాలి
తర్వాత పూరీని కత్తితో సన్నగా పొడవుగా రిబ్బన్స్ లా కట్ చేయాలి. మిర్చీకి గాటు పెట్టి అందులో తయారుచేసిన చికెన్ మిశ్రమం స్టఫ్ చేయాలి. మిర్చీనీ కట్ చేసిన పూరీ రిబ్బన్స్ మీద ఉంచి రోల్ చేసి కాగేనూనెలో వేసి వేగించాలి. ఈ బజ్జీలంటే నాన్ వెజ్ ప్రియులు చాలా ఇష్టపడతారు.. లొట్టలేసుకుంటూ లాగించేస్తారు.
►ALSO READ | నిమ్మకాయ తొక్కలు పడేస్తున్నారా..? ఇలా చేస్తే సూపర్ క్లీనింగ్ లిక్విడ్ రెడీ!
