యువతనే దేశ భవిష్యత్.. ఇక మోడీ గతం: రాహుల్ గాంధీ

యువతనే దేశ భవిష్యత్.. ఇక మోడీ గతం: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇది విద్యార్థుల సాధించిన విజయమని కొనియాడారు. విద్యార్థులే నిజమైన దేశభక్తులని అభివర్ణించారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తమ హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన విద్యార్థుల పోరాట పటిమకు హ్యాట్సాఫ్ చెప్పారు. 

దేశవ్యాప్తంగా విద్యార్థుల పోరాటం చూస్తే గర్వంగా ఉందన్నారు. దేశ విద్యావ్యవస్థ పునర్నిర్మాణంలో తొలి అడుగు పడిందని అన్నారు. ఈ చర్యతోనైనా విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. విద్యార్థుల మూడు డిమాండ్ లలో ఒకటి నెరవేరిందని.. మరో రెండు డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. 

శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు దమనకాండ కొనసాగించడంపై ప్రధాని మోడీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అలాగే, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‎పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. యువతనే దేశ భవిష్యత్ అని.. మోడీ ఇక గతమని రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతం భవిష్యత్తుతో ఇక ఎప్పటికీ పోరాడలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. 

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా:

నీట్ పేపర్ లీకేజీ, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్‎లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. సీజేపీ నిరసనకు మద్దతుగా ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. 

మరోవైపు.. ప్రధాన్ రాజీనామా చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు జులై 20న కాక్రోచ్ పార్టీ పార్లమెంట్ మార్చ్ (చలో సంసద్) కార్యక్రమం చేపట్టింది. ఈ చలో పార్లమెంట్ కార్యక్రమం తీవ్ర హింసాత్మకంగా మారింది. సీజేపీ నిరసనకారులపై పోలీసులు దమనకాండ కొనసాగించారు. విద్యార్థులపై విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ ప్రయోగించారు. పోలీసుల దాడిలో పదుల సంఖ్యలో నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిరసనకారులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజులుగా పార్లమెంట్‎ను స్తంభింపజేశాయి ప్రతిపక్షాలు. ఓ వైపు సీజేపీ.. మరోవైపు ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వం తీవ్ర ఒత్తడి నెలకొంది. దీంతో చేసేదేమి లేక సీజేపీ, ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.