ధన దాహంతో విద్యావ్యవస్థలో కొందరు అక్రమార్కులు సృష్టిస్తున్న చీకటి వ్యవస్థ.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది. రాత్రింబవళ్లు కష్టపడి చదివే యువత.. పేపర్ లీకుల కారణంగా నిరాశకు గురవుతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఇళ్లు, పొలాలు, ఆస్తులు అమ్ముకుని చదువులకు ఖర్చు చేస్తున్నా.. అక్రమార్కుల దందా వల్ల వారి త్యాగాలు వృథాగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వాలు, అధికార వర్గాలు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు తీవ్రస్థాయిలో వస్తూనే ఉన్నాయి.
సరిగ్గా దేశవ్యాప్తంగా ఈ పేపర్ లీక్ వివాదం సంచలనంగా మారిన వేళ.. ఈ చీకటి కోణాన్ని, విద్యార్థుల ఎమోషన్స్‌ను కళ్లకు కట్టేలా ZEE5 ప్లాట్‌ఫారమ్.. ‘ది స్కామ్: లీక్డ్’ (The Scam: Leaked) అనే సరికొత్త వెబ్ సిరీస్‌తో ముందుకు వచ్చింది. లేటెస్ట్గా విడుదలైన ఈ సిరీస్ టీజర్, విద్యా వ్యవస్థలోని లొసుగులను సూటిగా ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది!
కేవలం 1 నిమిషం 9 సెకన్ల నిడివితో వచ్చిన ఈ వెబ్ సిరీస్ టీజర్ ఆలోచింపజేసేలా ఉంది. "ఒకే ఒక్క పేపర్.. లక్షలాది కలలు.. ఒకే ఒక్క లీక్.. దేశం మొత్తం ఆశ్చర్యంలో!" అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో జీ5 ఈ వీడియోను పోస్ట్ చేసింది.
అగ్గిరాజేసిన ‘ది స్కామ్’ టీజర్?
టీజర్‌లో ప్రశ్నాపత్రాల ప్రింటింగ్ ప్రక్రియ, వాటి భద్రతా ఏర్పాట్లు, ప్యాకింగ్, రవాణా వంటి అంశాలను చూపించారు. అత్యంత భద్రత మధ్య తరలించే ప్రశ్నాపత్రం ఒక మొబైల్ ఫోన్ ద్వారా ఫోటో తీసి, PDF రూపంలోకి మార్చి లీక్ చేసినట్లు చూపించారు. ఆ తర్వాత ఈ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారడం, పరీక్ష రద్దు చేయాలనే డిమాండ్లు, మళ్లీ పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు కోరడం వంటి సంఘటనలను టీజర్‌లో మలిచారు. ముఖ్యంగా టీజర్ చివర్లో పేపర్ లీక్ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించడం నెటిజన్లను తీవ్రంగా కలిచివేస్తోంది.
కళ్లారా చూస్తున్న డార్క్ రియాలిటీ: రోజువారీ విద్యా వ్యవస్థలోని లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక ఉన్న చీకటి కోణాలు, న్యాయం కోసం విద్యార్థులు పడుతున్న ఆవేదనను ఈ సిరీస్ ఎలాంటి సెన్సార్‌షిప్ లేకుండా ఎంత బోల్డ్‌గా చూపించబోతోందోనని ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. మొత్తంగా విద్యా వ్యవస్థలో కల్తీ, విద్యార్థుల పోరాటాల చుట్టూ తిరిగే ఈ సిరీస్ రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ అగ్గిరాజేస్తుందో చూడాలి.
