కాకతీయుల ‘గొలుసు’ తెగింది.. వరంగల్‌‌‌‌‌‌‌‌ కూ ‘హైడ్రా’ తరహా ‘వాడ్రా’ కావాలి..!

కాకతీయుల ‘గొలుసు’ తెగింది..  వరంగల్‌‌‌‌‌‌‌‌ కూ ‘హైడ్రా’ తరహా ‘వాడ్రా’ కావాలి..!

వరంగల్ (ఓరుగల్లు) అనగానే అద్భుతమైన కాకతీయ శిల్పకళతో పాటు, ఇక్కడి చారిత్రక చెరువులు గుర్తుకొస్తాయి. ఓరుగల్లును  పాలించిన  కాకతీయ రాజులు  దూరదృష్టితో  ప్రతి గ్రామంలోనూ గొలుసుకట్టు  చెరువుల వ్యవస్థను, వాటి పక్కనే  శివాలయాలను  నిర్మించేవారు.  గొలుసుకట్టు విధానం అంటే  ఒక  చెరువు  నిండిన తర్వాత,  ఆ అదనపు  నీరు నాలా (కాలువ) ద్వారా సహజంగానే  తర్వాతి  చెరువుకు చేరుకునే  అద్భుతమైన సాంకేతికత.  

వరంగల్ నగర ప్రాంతం ఎగువన ఉండటం,  నదుల అనుసంధానం తక్కువగా ఉండటంతో,  వ్యవసాయానికి,  తాగునీటికి ఈ చెరువులే ప్రధాన వనరుగా మారాయి.  అయితే, కాలక్రమేణా పెరుగుతున్న పట్టణీకరణ వల్ల నగరంలోని అనేక చెరువులు,  నాలాలు  తీవ్ర ఆక్రమణలకు గురయ్యాయి.  చెరువుల  విస్తీర్ణం  కుంచించుకుపోవడంతో,  వర్షాకాలంలో స్వల్ప వర్షాలకే చెరువులు మత్తడి పోసి, వరద నీరు నివాస  ప్రాంతాలను ముంచెత్తుతోంది.  

గతంలో  వచ్చిన భారీ వరదలు  వరంగల్  నగరానికి పెద్ద నష్టాన్ని మిగిల్చాయి.  గత  బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ప్రభుత్వ కాలంలో 'మిషన్ కాకతీయ' పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో  పూడికతీత పనులు జరిగి రైతులకు మేలు జరిగినప్పటికీ, నగర పరిధిలోని  ఆక్రమణల వల్ల శివారు చెరువుల కట్టలు బలహీనపడి ముంపు సమస్యలు తలెత్తాయి.

వరంగల్‌‌‌‌‌‌‌‌లో  ‘వాడ్రా’ ఏర్పాటు చేయాలి

వరంగల్​ నయీంనగర్ నాలా (పెద్ద మోరీ) ప్రాంతం  ప్రతి ఏటా వరదల్లో మునిగిపోయేది. ఈ సమస్య పరిష్కారానికి నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్,  ఎమ్మెల్యే  దాస్యం వినయ్ భాస్కర్  నూతన బ్రిడ్జి,  నాలా  వెడల్పు పనులకు శంకుస్థాపన  చేసినప్పటికీ,   ఆ పనులు ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత 2023  ఎన్నికల్లో  కాంగ్రెస్  ప్రభుత్వం ఏర్పడటం,  రేవంత్ రెడ్డి  ముఖ్యమంత్రి కావడం,  వరంగల్  పశ్చిమ ఎమ్మెల్యేగా నాయిని రాజేందర్ రెడ్డి గెలుపొందడం  జరిగాయి.  

ఎమ్మెల్యే  రాజేందర్ రెడ్డి తన ఎన్నికల హామీ మేరకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించి, యుద్ధప్రాతిపదికన ఆరు నెలల్లోనే  నయీంనగర్ నాలా పనులను పూర్తి చేయించారు.  దీనివల్ల గత ఏడాది భారీ వర్షాలు పడినా ఆ ప్రాంతం ముంపునకు  గురికాకుండా  సురక్షితంగా ఉంది.  ప్రస్తుతం నగరంలోనే  అతిపెద్దదైన  భద్రకాళి  చెరువు పూడికతీత పనులు జరుగుతున్నప్పటికీ, అవి నత్తనడకన సాగుతుండటంతో రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో  ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణ కోసం తీసుకొచ్చిన ‘హైడ్రా’ తరహాలోనే..  వరంగల్‌‌‌‌‌‌‌‌లో  కూడా ‘వాడ్రా’ లాంటి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని వరంగల్ ప్రజలు కోరుతున్నారు.  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  వరంగల్  అభివృద్ధిపై  ప్రత్యేక దృష్టి  సారించినందున, ఈ ఆక్రమణల నివారణపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  వరంగల్  పశ్చిమ, తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని  ప్రజలు స్వచ్ఛందంగా 'చెరువు పరిరక్షణ కమిటీలు'గా  ఏర్పడి  అధికారులకు  నివేదికలు ఇస్తున్నారు.  ప్రజాప్రతినిధులు,  అధికారులు  పూర్తిస్థాయిలో స్పందించి కాకతీయుల నాటి చెరువుల వైభవాన్ని కాపాడాలని స్థానికులు కోరుకుంటున్నారు.

- జక్కుల రాహుల్ యాదవ్
కాకతీయ యూనివర్సిటీ 

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.