పంట వ్యర్థాలతో విద్యుత్తు, సేంద్రియ ఎరువులు

పంట వ్యర్థాలతో విద్యుత్తు, సేంద్రియ ఎరువులు

మన రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల్లో సాగు సామర్థ్యం పెరిగింది.  నేడు మన  రైతులు అధిక పంట దిగుబడులను పొందుతున్నారు. అయితే, అధిక దిగుబడి రావడంతో  రైతులు పంటకోత తర్వాత పంట వ్యర్థాలను కాల్చడం  కొత్త సమస్యలకు  దారితీస్తున్నది.  తెలంగాణ  దేశంలోని  ప్రధాన వరి పండించే రాష్ట్రాలలో ఒకటి. 

పంట వ్యర్థాలను  కాల్చే విషయంలో  పంజాబ్‌‌‌‌‌‌‌‌,  హర్యానా లాంటి ఇతర అధిక వరి పండించే రాష్ట్రాల మాదిరిగా మన రాష్ట్రంలో పంట వ్యర్థాలను  తగలబెట్టడం ఇదివరకు మన రాష్ట్ర రైతులు చేపట్టేవారు కాదు. కానీ, గత  కొన్ని నెలలుగా  రాష్ట్రంలో పంట వ్యర్థాలను తగలబెడుతున్న పలు ఘటనలు వెలుగులోకి వచ్చాయి.  

సమస్యకు ప్రధాన కారణం అధికంగా వరి పండించడం,  పంటకు  పంటకు  మధ్య విత్తనాలు వేయడానికి తక్కువ సమయం ఉండటం, పంట కోత తర్వాత  పంట వ్యర్థాలను తొలగించడానికి కూలీల కొరత,  గ్రామాల్లో  పశుసంపద క్షీణించడం, పంట 
వ్యర్థాలను తొలగించడానికి అధిక ఖర్చు కావడం వంటి వివిధ అంశాలు కారణమవుతున్నాయి.  అందువల్ల  రైతులు  సులువుగా పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు. 

అయితే,  పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల వాతావరణంలో విపరీతమైన కాలుష్య సమస్యలు, నేలకు భారీ పోషక నష్టం,  భౌతిక ఆరోగ్య క్షీణత కలుగుతాయి.  పంట అవశేషాలను కాల్చడం వల్ల సుమారు 70 శాతం  కార్బన్ డయాక్సైడ్,  7 శాతం కార్బన్ మోనాక్సైడ్,  0.66 శాతం మిథేన్,   నైట్రస్ ఆక్సైడ్  రూపంలో 2.1శాతం  నత్రజని వెలువడుతాయని అంచనా. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల  వాటిలో ఉండే  మొత్తం కర్బనం,   సుమారు 80-–90 శాతం నత్రజని,  25శాతం భాస్వరం,  20శాతం పొటాషియం,  50శాతం గంధకం లాంటి పోషకాలు వివిధ వాయువులు,  సూక్ష్మ కణాల రూపంలో నష్టపోతాయి.  

ఒక టన్ను వరి గడ్డిని కాల్చడం వల్ల 3 కిలోల  కణ పదార్థం,  60 కిలోల  కార్బన్ డయాక్సైడ్, 1460 కిలోల కార్బన్ డయాక్సైడ్,  199 కిలోల  బూడిద,  2 కిలోల సల్ఫర్ డయాక్సైడ్  విడుదల  అవుతాయని అంచనా. అంతేకాకుండా, ఒక టన్ను వరి గడ్డిని  కాల్చడం వల్ల  నైట్రోజన్ (5.5 కిలోలు),  భాస్వరం (2.3 కిలోలు), పొటాషియం (25 కిలోలు),  సల్ఫర్ (1.2 కిలోలు)తో పాటు సేంద్రీయ కర్బనం నష్టపోతుంది. ఈ విధంగా  వివిధ విషవాయువులు,  సూక్ష్మ కణాలు  వాతావరణంలోకి  వెలువడడంతోపాటు మొక్కలకు అవసరమైన పోషకాలు నష్టపోవడం జరుగుతుంది.  దానివల్ల వాతావరణం, నేల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. 

ఏటా 500  మిలియన్ టన్నుల వ్యవసాయ వ్యర్థాలు

అనేక అధ్యయనాల ప్రకారం... పంజాబ్ రాష్ట్రంలో  పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఆయా ప్రాంతాల్లో నివసించే  ప్రజల్లో  శ్వాస సంబంధిత సమస్యలు,  ఊపిరితిత్తుల వ్యాధులు,  గుండె జబ్బులు,   ఆకలి మందగించడం వంటి వివిధ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని  నివేదికలు హెచ్చరించాయి.  

ఒక అధ్యయనం  ప్రకారం వాయువ్య  భారతదేశంలోని  వరి రైతులు తమ పొలాలను తగలబెట్టినప్పుడు  ఢిల్లీలో  సూక్ష్మ కణ పదార్థాల సాంద్రతలు,  ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన  సురక్షిత గాలి  ప్రమాణ స్థాయి కంటే సుమారు 20 రెట్లు అధికంగా పెరుగుతాయని అంచనా.  2003 నుంచి 2019 వరకు  వ్యవసాయ వ్యర్థాలను  కాల్చడం వల్ల  ఏటా 44,000 నుంచి 98,000 మంది అకాల మరణాలకు గురయ్యారని  (సూక్ష్మ కణాల ప్రభావం కారణంగా) తేలింది.  

దేశంలో  సాగు ఉత్పత్తి  పెరగడంతోపాటు వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే వ్యవసాయ వ్యర్థాలు పేరుకుపోవడం వలన  పర్యావరణానికి  ముప్పు  కలిగిస్తుంది. దేశంలోని  మొత్తం  గ్రీన్‌‌‌‌‌‌‌‌ హౌస్ వాయువుల ఉద్గారాలలో  భారత  వ్యవసాయ రంగం సుమారుగా 13.72 శాతం  వరకు  వాటాను  కలిగి ఉంది.  భారతదేశంలో  ఏటా  సుమారు 500  మిలియన్  టన్నుల వ్యవసాయ వ్యర్థాలు  ఉత్పత్తి  
అవుతున్నాయి. 

18,000  మెగావాట్లకు పైగావిద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం

మన రాష్ట్రంలో  వ్యవసాయ  విశ్వవిద్యాలయ  అంచనా ప్రకారం 2021  తెలంగాణలో ఉత్పత్తయిన మూడు ప్రధాన పంటల వ్యర్థాలు ఇలా ఉన్నాయి.  వరి పంట ద్వారా 15.30 కోట్ల  క్వింటాళ్లు,  పత్తి ద్వారా 10.43 కోట్ల క్వింటాళ్లు,  మొక్కజొన్న ద్వారా 1.05  కోట్ల  క్వింటాల వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి.  వ్యవసాయ  వ్యర్థాలను సుస్థిరంగా మార్చడం వలన శక్తి ఉత్పత్తి,  వనరుల పునరుద్ధరణ అనే రెండు ప్రయోజనాలు లభించవచ్చు.  

నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రి త్వశాఖ ప్రకారం,  భారతదేశంలోని వ్యవసాయ వ్యర్థాలు ఏటా 18,000  మెగావాట్లకు పైగా విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.  విద్యుత్తు ఉత్పత్తితోపాటు, ఈ వ్యర్థాలను పోషకాలు అధికంగా ఉండే సేంద్రియ ఎరువులను తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.  కావున  దేశంలో,  రాష్ట్రంలోని ఈ అపారమైన హరిత వ్యర్థాలను నిర్వహణ పద్ధతులు ఎంతో అవసరం.    

పంట అవశేషాలను  పొలంలోనే ఉంచడం,  భూమిలో  కలిపివేయడం లేదా మల్చింగ్ చేయడం,  పంట వ్యర్థాలను కుళ్లించే సూక్ష్మజీవుల సముదాయాలను ఉపయోగించి వాటిని కుళ్ళింపజేయడం అనేవి క్షేత్రస్థాయిలో  పంట అవశేషాల నిర్వహణకు సాధ్యమయ్యే పద్ధతులు.  ఇక క్షేత్రేతర పద్ధతుల్లో  పొలం నుంచి గడ్డిని బేళ్లుగా కట్టి ఇతర ప్రాంతాలకు రవాణా చేసి వివిధ రకాల ఇతర ప్రయోజనాలకు వాడడం.   భారతీయ  వ్యవసాయ పరిశోధన మండలి,  పంట వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ప్రత్యామ్నాయ,   క్షేత్రేతర విధానాల ఆర్థిక విశ్లేషణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.  

కమిటీ సిఫార్సులు 

కమిటీ పంట వ్యర్థాల క్షేత్రేతర  నిర్వహణకు సంబంధించిన నాలుగు ప్రత్యామ్నాయాలను  సిఫార్సు చేసింది.  

  • 1. ఉష్ణ విద్యుత్  కేంద్రాలలో ఇంధన ప్రత్యామ్నాయంగా పంట వ్యర్థాల నుంచి బయోమాస్  గుళికల వినియోగించాలి.  
  • 2. గృహ లేదా సముదాయ స్థాయిలో వరిగడ్డి నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చెయ్యవచ్చు, 
  • 3. వరిగడ్డి నుంచి పారిశ్రామిక స్థాయిలో  బయోగ్యాస్/ బయో- (సీఎన్​జీ) / కంప్రెస్డ్ బయో-గ్యాస్ (సీబీజీ) ఉత్పత్తి చెయ్యవచ్చు.  
  • 4. జీవద్రవ్యరాశి (బయోమాస్) నుంచి విద్యుత్ ఉత్పత్తి  చేయవచ్చని పేర్కొంది.  థర్మల్  విద్యుత్ కేంద్రాలలో బయోమాస్ ఆధారిత  పెల్లెట్ల  విని యోగంపై  ఆర్థిక  విశ్లేషణలో  కమిటీ  ఈ విధంగా  పేర్కొంది.  ఉత్తర భారతదేశంలోని  ప్రస్తుతం ఉన్న విద్యుత్ కేంద్రాలన్నీ (44,560 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో) తమ ఇంధనానికి బదులుగా  వరిగడ్డి ఆధారిత  పెల్లెట్లను ఉపయోగిస్తే,  అవి ఏటా 17.82 మిలియన్ టన్నుల వరి గడ్డిని వినియోగిస్తాయి.  దీనివల్ల  ఆ సమస్య దాదాపు పూర్తిగా పరిష్కారమవుతుంది.  

పంట వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక పథకం ప్రవేశపెట్టాలి

 పంట వ్యర్థాలు కాల్చడం వల్ల ఏర్పడే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి అవసరమైన యంత్రాలను సమకూర్చడం. రైతులు వ్యవసాయ వ్యర్థాలను నిర్మాణాత్మకంగా నిర్వహించుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా నిర్మించిన వ్యవసాయ యంత్రాలైన హ్యాపీ సీడర్ (నిలబడి ఉన్న పంట మోళ్లలో విత్తనాలు నాటడానికి), రోటవేటర్ (పొలాన్ని సిద్ధం చేసి పంట అవశేషాలను మట్టిలో కలపడానికి), జీరో టిల్ సీడ్ డ్రిల్ (పొలాన్ని సిద్ధం చేసి, ఉన్న మోళ్లను తొలగించకుండా నేరుగా విత్తనాలు నాటడానికి), బేలర్ (వరి గడ్డిని సేకరించి బేళ్లుగా చేయడానికి), ప్యాడీ స్ట్రా చాప్పర్ (మట్టిలో సులభంగా కలపడానికి వరి మోళ్లను కత్తిరించడానికి), రీపర్ బైండర్ (వరి మోళ్లను కోసి కట్టలుగా చేయడానికి),  టర్బో హ్యాపీ సీడర్  వంటి పంట వ్యర్థాల క్షేత్రస్థాయి నిర్వహణకు అవసరమైన యంత్రాలకు రాయితీ కల్పించాలి.  

వ్యవసాయ వ్యర్థాలు అనేక ఇతర వస్తువుల తయారీలో కూడా వినియోగించవచ్చు.  బయోప్లాస్టిక్​ ఉత్పత్తికి,  హరిత నిర్మాణ సామగ్రి, కార్డ్‌‌‌‌‌‌‌‌బోర్డ్,  కాగితం లాంటి వస్తువుల తయారీకి స్థిరమైన ముడి పదార్థాలుగా  వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించవచ్చు. 

- డా. రేపల్లె నాగన్న, 
కన్సల్టెంట్, నేషనల్ ​ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ అగ్రికల్చరల్ ​ఎక్స్​టెన్షన్​ మేనేజ్​మెంట్

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.