ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
  • ఊరూరా మురిసిన మువ్వన్నెల జెండా

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 77వ భారత గణతంత్ర దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఊరూరా, వాడవాడన మువ్వన్నెల జెండాను ఎగురవేసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఇతర జాతీయ నాయకులకు నివాళులర్పించారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఆయా జిల్లాల కలెక్టర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

 జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసపత్రాలు అందజేశారు. కరీంనగర్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సీపీ గౌష్ ఆలం, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌‌చార్జి వెలిచాల రాజేందర్ రావు  పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కలెక్టర్ స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ మన రాజ్యాంగంలో పొందుపర్చిన సూత్రాలకు, రాజ్యాంగ ఆదర్శాల సాకారానికి తోడ్పడడం పౌరులుగా మన కర్తవ్యమన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డి పాలనలో విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ, పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి కల్పన, అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఐ.టీ నుంచి అగ్రికల్చర్ వరకు అన్నిరంగాల్లో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ అనతికాలంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నామని వెల్లడించారు.   కలెక్టరేట్‌‌లో అడిషనల్ కలెక్టర్‌‌‌‌, మున్సిపల్ ఆఫీస్‌‌లో కమిషనర్‌‌‌‌ ప్రఫుల్ దేశాయ్​ జాతీయ జెండా ఆవిష్కరించారు. 

పెద్దపల్లి/గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రిపబ్లిక్​ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు రిపబ్లిక్​ డే సందర్భంగా జాతీయ జెండాలు ఆవిష్కరించారు. కలెక్టరేట్, డీసీపీ ఆఫీసుతో పాటు ఆయా అధికార కార్యాలయాల వద్ద జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ రాజ్యాంగం విశిష్టతను వివరించారు. 

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లీడర్లు జాతీయ జెండాలు ఎగురవేశారు. కమిషనరేట్‌‌లో సీపీ అంబర్​కిశోర్‌‌‌‌ ఝా, సింగరేణిలో జీఎం డి.లలిత్​ కుమార్​, ఆర్‌‌‌‌ఎఫ్‌‌సీఎల్‌‌లో సీఈవో ఎస్.మనోహరన్​, జిల్లా అడిషనల్​ కోర్టులో జడ్జి శ్రీనివాసరావు, టీబీజీకెఎస్​ ప్రెసిడెంట్​ మిరియాల రాజిరెడ్డి, జాతీయ జెండా ఎగురవేశారు. సింగరేణిలో ఉత్తమ కార్మికులను సత్కరించగా, కమిషనరేట్‌‌లో పోలీస్​ అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. 

జగిత్యాల, వెలుగు: భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు, బాధ్యతలు కల్పిస్తున్న గొప్ప దేశమని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం జగిత్యాల పోలీస్ పరేడ్ గ్రౌండ్‌‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. విద్యార్థుల కల్చరల్ ప్రోగ్రామ్స్‌‌, ఎన్‌‌సీసీ క్యాడెట్ల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 125 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు.

సంక్షేమ పాలన అందిస్తున్నాం

రాజన్న సిరిసిల్ల,వెలుగు: ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తున్నామని కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని  పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలోని వివిధ శాఖలలో ప్రతిభ కనబరిచిన 273 మంది ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు.

 అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో పంచాయతీ ఎన్నికలు అందరి సహకారంతో  సజావుగా నిర్వహించుకున్నామని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఎస్పీ మహేశ్ కుమార్ బి.గీతే, ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.