అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్ షిప్ కోర్సు క్లాసులకు హాజరయ్యారు సీఎం రేవంత్రెడ్డి. తొలిరోజు 21వ శతాబ్ధంలో నాయకత్వంపై కోర్సులో భాగంగా అధికారిక విశ్లేషణ– నాయకత్వం అంశంపై తొలి సెషన్సాగింది. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థిగా మారి క్లాసులు విన్నారు.
క్లాసుల్లో భాగంగా అధికారిక విశ్లేషణ– నాయకత్వం అంశంపై కేస్ అనాలిసిస్, వివిధ అంశాలపై తరగతులు, కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్ వంటి కార్యక్రమాల్లో సభ్యులు పాల్గొన్నారు. హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన కెనెడీ స్కూల్ లో సోమవారం(జనవరి 26) ఉదయం ఏడుగంటలకే తరగతులు ప్రారంభం కాగా సాయంత్రం 6గంటలవరకు కొనసాగాయి.
దావోస్ లో మూడు రోజుల పర్యటన పూర్తిచేసుకున్న తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్ షిప్ కోర్సుకోసం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా బయలుదేరి వెళ్లారు. జనవరి 30 వరకు అమెరికాలో సీఎం పర్యటన కొనసాగనుంది. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థిగా మారి.. హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్ షిప్ పై సర్టిఫికెట్ కోర్సుఅభ్యసిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ కోర్సు చేస్తున్న తొలి సీఎంగా అరుదైన ఘనత దక్కించుకోనున్నారు.
