అదనపు కట్నం కోసమే..యూట్యూబర్ వైష్ణవి హత్యకేసులో భర్త అరెస్ట్

అదనపు కట్నం కోసమే..యూట్యూబర్ వైష్ణవి హత్యకేసులో భర్త అరెస్ట్

జగిత్యాల జిల్లా యూట్యూబర్ వైష్ణవి  హత్య కేసులో ఆమె  భర్త హరిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 18న నిందితుడు హరిబాబును   మీడియా ఎదుట హాజరు పరిచిన పోలీసులు అదనపు కట్నం కోసమే వైష్ణవిని హత్య చేసినట్లు చెప్పారు. 

మెట్ పల్లి డీఎస్పీ  రాములు  చెప్పిన వివరాల ప్రకారం..  మార్చి 17న తెల్లవారుజామున  కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి హత్యకు గురైంది.  హత్య చేసి పరారైన ఆమె భర్త హరిబాబును  మార్చి 17న  రాత్రి కోరుట్ల శివారులో  అదుపులోకి తీసుకున్నారు.  తల్లి, అన్నల సూచనలతో తరచు అదనపు కట్నం కోసం వైష్ణవిని భర్త హరిబాబు వేధించేవాడు.  అదనపు కట్నం విషయంలో భార్య భర్తల మధ్య గొడవ కాస్త హత్యకు దారి తీసింది. హరిబాబు, అతని తల్లి లక్ష్మి, ఇద్దరు అన్నలు ఆనంద్, అశోక్ లపై కేసు నమోదు చేశాం.  హత్యకు ఉపయోగించిన కత్తి, పరారీ కావడానికి ఉపయోగించిన పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నాం.  హరిబాబును   రిమాండ్ పంపగా, తల్లి లక్ష్మి, అన్నలు ఆనంద, అశోక్ లు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నాం అని  డీఎస్పీ రాములు తెలిపారు. 

►ALSO READ | మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణం.. మూడు రకాల డ్రగ్స్ వాడినట్లు తేల్చిన పోలీసులు

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో మార్చి 17 న ఉదయం  వైష్ణవిని  ఆమె భర్త హరిబాబు హత్య చేశాడు. వైష్ణవి నాలుగు నెలల గర్భవతి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వైష్ణవి, హరిబాబుల మధ్య గొడవ జరిగింది. తెల్లవారి లేచేసరికి ఇంట్లో అచేతనంగా పడి ఉన్న వైష్ణవిని కుటుంబ సభ్యులు గుర్తించారు. భర్తనే హత్య చేశాడని పోలీసులకు వైష్ణవి కుటుంబం ఫిర్యాదు చేసింది.  వైష్ణవి భర్త హరిబాబు కనిపించకుండాపోవడంతో పోలీసులు అతని కోసం గాలించి నిన్న రాత్రి కోరుట్ల శివారులో అరెస్ట్ చేశారు. 

 మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవితో సంవత్సరం క్రితం కోరుట్ల అయ్యప్ప గుట్టకు చెందిన హరిబాబుకు వివాహం అయింది. ఈ ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఏడు నెలల క్రితం ఈ ప్రేమ జంట యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టింది.దాదాపు 58 వేల సబ్ స్క్రైబర్లు ఉన్నారు.