హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ఫామ్‌హౌస్ పార్టీలో మూడు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. కొకైన్, MDMAతో పాటు మెథోఇథిపిన్ వాడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి రెండు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. ఎక్కువ కిక్కు కోసం కాస్ట్లీ మద్యంతో పాటు డ్రగ్స్ వాడినట్లు గుర్తించారు.
కౌశిక్ రవి సిమ్లా నుంచి కొకైన్ డ్రగ్స్ తీసుకొచ్చాడు. అభిషేక్ నుంచి MDMAతో పాటు మెథోఇథిపిన్ను శరత్ కొనుగోలు చేశాడు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో రోహిత్ రెడ్డి, ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్, రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్టర్ నమిత్ శర్మ సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
చంచల్‌గూడ జైలు రిమాండ్‌లో ఉన్న రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ, రితేష్ రెడ్డితో పాటు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ మినహా మిగిలిన 8 మంది నిందితులను మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారించారు. కౌశిక్ రవి ఎంత మొత్తంలో డ్రగ్స్ తెచ్చాడు, పార్టీలో ఎంత వినియోగించారని ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రధానంగా నమిత్ శర్మకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిలో ముగ్గురు జైలులో ఉండగా, కౌశిక్ రవి, పబ్ నిర్వాహకుడు అర్జున్ రెడ్డిని 45 రోజుల పాటు డీఅడిక్షన్ సెంటర్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీ మహేశ్ యాదవ్ ఏప్రిల్ 4న విచారణకు హాజరవుతానని పోలీసులకు తెలిపారు.
నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి వ్యాపారాలపై సిట్ ఫోకస్ పెట్టనుంది. నమిత్ శర్మ ఏ వ్యాపారాలు చేస్తారు, రోహిత్ రెడ్డితో కలిసి చేస్తున్న దందాలేంటి అన్న సమాచారం సేకరించనున్నారు. కొంతకాలంగా ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై, వీకెండ్ పార్టీలకు హాజరయ్యే హై ప్రొఫైల్ వ్యక్తులు, రోహిత్ రెడ్డి డ్రగ్స్ నెట్‌వర్క్‌పై సిట్ దర్యాప్తు చేయనుంది. డ్రగ్స్ నెట్‌వర్క్‌ను చేధించేందుకు నిందితుల కాల్ డేటాతో పాటు సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తారు.
