గత కొన్ని రోజులుగా అసంతృప్తిగా మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించేందుకు రంగంలోకి దిగింది. ఈ క్రమంలో మధ్యవర్తిగా ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకట స్వామి జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంట్లో సుమారు గంట పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కత్తి వెంకటస్వామి.. పార్టీ అధిష్టానం ఆదేశాలతోనే జీవన్ రెడ్డి దగ్గరికి వచ్చానని చెప్పారు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడిని పార్టీ వదులుకోదన్నారు. జీవన్ రెడ్డి ఎంతో ఆవేదనతో ఉన్నారు చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చన్నారు. జీవన్ రెడ్డితో చర్చించిన విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. జీవన్ రెడ్డితో చర్చించిన విషయాలు అధిష్టానానికి చెప్తా.. మీడియాకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
ఉగాది తర్వాత చెప్తా
కాంగ్రెస్ పార్టీని వీడాలని తాను అనుకోవడంలేదని, కానీ కొందరి వ్యవహార శైలి తనను ఆలోచించేలా చేస్తోందని జీవన్ రెడ్డి అన్నారు. తన భవిష్యత్ గురించి ఉగాది తర్వాత ప్రకటిస్తానని నిర్ణయాన్ని చెప్పారు. గౌరవం లేనప్పుడు అభిమానాన్ని చంపుకుని పార్టీలో ఎలా కొనసాగుతానని ప్రశ్నించారు. ఒక వేళ నేను పార్టీ మారాల్సివస్తే అందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్, హైకమాండ్ కారణం అవుతారన్నారు. అసలు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో తేల్చుకుని మాట్లాడాలని, ఆయన బీఆర్ఎస్ కు చెందినవాడని స్పీకర్ ప్రకటించారని, అలాంటి వ్యక్తి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించారు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని ఎవరూ వదులుకోవాలనుకోరని, కానీ ‘‘పార్టీలో ఉడుములా సొచ్చిండు.. ఉడుముతో ఎవరైనా కలిసి ఉంటారా’’ అంటూ సంజయ్‌పై విరుచుకుపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో సంజయ్ జోక్యం వల్ల అసలైన కార్యకర్తలకు న్యాయం జరగలేదని ఆరోపించారు.
►ALSO READ | పోలీస్ SI భార్య దివ్య ఆత్మహత్య కేసులో ట్విస్ట్ : అంత్యక్రియల సమయంలో హై టెన్షన్
