మేడారంలో పోలీసుల రిహార్సల్.. సమ్మక్క తల్లిని గద్దెకు చేర్చే ప్రక్రియపై రోప్ పార్టీ మాక్ డ్రిల్

మేడారంలో పోలీసుల రిహార్సల్.. సమ్మక్క తల్లిని గద్దెకు చేర్చే ప్రక్రియపై రోప్ పార్టీ మాక్ డ్రిల్
  •   తల్లులను తిలకించేందుకు  లక్షలాది మంది భక్తుల రాక

మంగపేట, తాడ్వాయి, వెలుగు: మేడారం మహాజాతరను పురస్కరించుకుని మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా తల్లి సమ్మక్క రాక కోసం భక్తులు ఎదురు చూసే తంతును విజయవంతంగా పూర్తి చేసేందుకు పోలీసు శాఖ రిహార్సల్స్​చేపట్టింది. 28న సారలమ్మ, 29న సమ్మక్క గద్దెలపై కొలువుదీరనుండగా ఆ మహాఘట్టాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. 

అమ్మవార్లను గద్దెలపైకి తెచ్చేటప్పుడు  ఎలాంటి ఘటనలు జరగకుండా ములుగు ఎస్పీ రాంనాథ్ కేకన్, అడిషనల్ ఎస్పీ సదానందం పర్యవేక్షణలో సోమవారం ఉదయం మాక్​డ్రిల్ నిర్వహించారు.  సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి తీసుకొచ్చేందుకు ఆదివాసీ యువకులతో పాటు శిక్షణ పొందిన పోలీసులతో రిహార్సల్స్​చేయించారు. ఇందులో ఆదివాసీ పోలీసులే ఎక్కువగా ఉండడం విశేషం. మూడంచెల భద్రతతో పోలీసులు సమ్మక్కను గద్దె వద్దకు చేర్చడం, ఆదివాసీ పూజారులకు రక్షణగా యువకులు కూడా ఉంటారు. 

రూట్ క్లియర్ చేస్తూ సుమారు 100మంది పోలీసులు ఉంటారు. ఆదివాసీ యువకులకు రక్షణగా 80 రోప్ పార్టీ కూడా సపోర్ట్ గా నిలువనుంది. రోప్ పార్టీ పోలీసులతో పాటు సుమారు 25 మంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ఈ మహా ఘట్టాన్ని పర్యవేక్షిస్తారు. 

తల్లులను తరలించే ప్రక్రియను తిలకించేందుకు లక్షలాది భక్తులు  వస్తారు. నిండారు స్నానాలు చేసి తల్లులకు సాగిల పడతారు. పోలీసులు ముందస్తుగా రోప్ పార్టీతో రిహార్సల్స్ చేస్తున్న సన్నివేశాన్ని భక్తులతో పాటు స్థానికులు  తిలకించారు.