తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని.. గ్యాస్ బండలు చాలా ఉన్నాయని.. కస్టమర్లు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్టానికి అవసరం అయిన గ్యాస్ నిల్వలు ఉన్నాయని.. గృహ వినియోగానికి అవసరం అయిన గ్యాస్ సరఫరా నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారాయన. 2026, మార్చి 14వ తేదీన.. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, పోలీస్ ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారాయన.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఉత్తమ్ .. రాష్ట్రంలో గ్యాస్ కు కొరత లేదు. గ్యాస్ గృహ వినియోగదారులు గందరగోళానికి గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తాం. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలి. బ్లాక్ మార్కెట్ చెస్ట్ చర్యలు కఠినంగా ఉంటాయి. గ్యాస్ గృహ వినియోగదారులకు ఎక్కడ అసౌకర్యం కలిగించేలా చేస్తే ఉపేక్షించేది లేదు. గ్యాస్ బ్లాక్ జరగకుండా కలెక్టర్లు , సీపీలు, ఎస్పీలు ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాలి. ఆసుపత్రిలకు,ప్రభుత్వ వసతి గృహాలకు సరిపడా గ్యాస్ సరఫరా చేయాలి అని ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా డొమెస్టిక్ సిలిండర్ల కోసం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బుక్ చేసినా రావడం లేదంటూ గ్యాస్ బండలతో ఏజెన్సీ ముందు వినియోగదారులు క్యూ కట్టారు.అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కృత్రిమ కొరత సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లయ్ మంత్రి ఆదేశాలు జారీ చేశారు .
