ఇరాన్ లో ఉగ్రవాద పాలనను అంతం చేస్తాం : డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ లో ఉగ్రవాద పాలనను అంతం చేస్తాం : డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ లో ఉగ్రవాద పాలనను అంతమొందిస్తామన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.  ఇరాన్ ను సైనికపరంగా,  ఆర్థికంగా అన్ని విధాలుగా సమూలంగా నాశనం చేస్తామని హెచ్చరించారు.  ఇరాన్,అమెరికా యుద్దం కవరేజీ విషయంలో మీడియాను కూడా విమర్శించారు ట్రంప్.  యుద్దం కారణంగా ఇరాన్ కు జరిగిన నష్టాన్ని తక్కువగా  అంచనా వేస్తున్నారన్నారు.  హార్ముజ్ జలసంధి సమీపంలో నౌకలపై దాడులు పెరగడం, మిడిల్ ఈస్ట్ లో సంక్షోభం ముదురుతున్న కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరిపేరుతో ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు రెండో వారానికి చేరిన సందర్భంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు. ఇరాన్ పై సైనికదాడి నిర్ణయాత్మక విజయమని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ పోస్ట్ లో చెప్పారు. 

‘‘మేం ఇరాన్ ఉగ్రవాద పాలనను సైనికపరంగా, ఆర్థికంగా పూర్తిగా నాశం చేస్తున్నామని ట్రూత్ లో రాశారు. యుద్దం కవరేజీని మీడియా తప్పుగా అంచనా వేస్తుందన్నారు. కొన్ని మీడియా సంస్థలు ఇరాన్ దళాలపై అమెరికా సైన్యం చేసిన దాడిని , జరిగిన నష్టాన్ని తక్కువగా అంచనా వేస్తున్నాయన్నారు. ఇరానియన్ సైనిక స్థావరాలు, నావికా స్థావరాలు ,ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లకు చెందిన స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులు జరిపామన్నారు. 

ఇజ్రాయెల్,అమెరికా  జరిపిన దాడుల్లో ఇరాన్ సైనిక ఆస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయని ట్రంప్ చెప్పారు.  ఇరాన్ నేవీ పోయింది.. వారి వైమానిక దళం ఇక లేదు..క్షిపణులు, డ్రోన్లు అన్నీ నాశనమవుతున్నాయి" అని ట్రంప్ అన్నారు. అమెరికన్ దళాలు, అసమానమైన ఆయుధ సంపత్తి తెలియాలంటే కొంత సమయం పడుతుందన్నారు. 

ఇరాన్ పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ..

ఇరాన్ అంతటా అమెరికా ,ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న క్రమంలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీపై మాట్లాడిన ట్రంప్  ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 28న ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ సైనిక ,భద్రతా యంత్రాంగానికి సంబంధించిన వేలాది లక్ష్యాలను ఛేదించామని అమెరికా సైనిక అధికారులు తెలిపారు. క్షిపణి కేంద్రాలు, డ్రోన్ సౌకర్యాలు, యుద్ద నౌకలు, IRGCకి సంబంధించిన ప్రదేశాలే లక్ష్యంగా ఈ దాడులు చేశామని చెప్పారు.