భారత స్టాక్ మార్కెట్లకు ఈ వారం ఒక పీడకలలా మారింది. గల్ఫ్ లో ముదురుతున్న పరిస్థితులతో అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల పవనాలు దలాల్ స్ట్రీట్‌ను కుదిపేస్తున్నాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 3వ రోజు కూడా భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,343 పాయింట్లు పతనమై 74,690 వద్దకు చేరగా, నిఫ్టీ 439 పాయింట్లు క్షీణించి 23,200 మార్కు దిగువకు పడిపోయింది. ఈ వారంలో ఇప్పటివరకు సెన్సెక్స్ 4.5 శాతం, నిఫ్టీ 4.8 శాతం నష్టపోయాయి. 2024 డిసెంబర్ తర్వాత మార్కెట్లు ఇంతటి భారీ వారపు పతనాన్ని చూడటం ఇదే మొదటిసారి. దీంతో ఇవాళ రూ.7 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైపోయింది.
ఈ పతనానికి ప్రధాన కారణం క్రూడ్ ఆయిల్ ధరలు సెంచరీ మార్కును తాకడమే. ఇరాన్ దాడుల కారణంగా హోర్ముజ్ జలసంధి గుండా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందనే భయంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100.5 డాలర్లకు చేరింది. భారత్ తన క్రూడ్ అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతుంది కాబట్టి, ధరలు పెరిగితే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగి ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుంది. ఇది సహజంగానే కార్పొరేట్ కంపెనీల లాభాలపై ప్రభావం చూపుతూ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది.
మరోవైపు.. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(FIIs) భారత మార్కెట్ల నుండి తమ పెట్టుబడులను వేగంగా వెనక్కి తీసుకుంటున్నారు. కేవలం గురువారం నాడే ఎఫ్ఐఐలు రూ.7వేల 049 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, ఈ మార్చి నెలలో ఇప్పటివరకు ఏకంగా రూ.39వేల కోట్లకు పైగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. దీనికి తోడు భారత రూపాయి విలువ డాలరుతో పోలిస్తే చారిత్రక కనిష్ట స్థాయి 92.37 వద్దకు పడిపోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. రూపాయి బలహీనపడటంతో దిగుమతి ఖర్చులు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడుతోంది.
అంతర్జాతీయంగా అమెరికా మార్కెట్లు కుప్పకూలడంతో ఆసియా దేశాలైన జపాన్, దక్షిణ కొరియా, చైనా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉండటం భారత మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. మార్చి 17న జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. ప్రస్తుతం మార్కెట్ అనిశ్చితిలో ఉందని, కోలుకోవడానికి మరింత సమయం పట్టవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. లార్సెన్ అండ్ టూబ్రో, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి దిగ్గజ షేర్లు సైతం ఈ అమ్మకాల ఒత్తిడికి తలొగ్గాయి. మొత్తం మీద యుద్ధం, చమురు మంటలు, రూపాయి పతనం కలిసి ఇన్వెస్టర్ల సంపదను భారీగా హరించివేస్తున్నాయి.
