కేసీఆర్ హయాంలో విధ్వంసం..రేవంత్ పాలనలో వికాసం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కేసీఆర్ హయాంలో విధ్వంసం..రేవంత్ పాలనలో వికాసం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  •     రిపబ్లిక్ డే వేడుకల్లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కామెంట్

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ పాలనలో ఆర్థిక విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి వికాసం వైపు నడిపిస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. సోమవారం రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన గాంధీ భవన్​లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కేడర్​ను ఉద్దేశించి మహేశ్ గౌడ్  మాట్లాడారు. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను ప్రజల ఆకాంక్షల మేరకు రేవంత్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. ప్రజల ఆశలకు పెద్దపీట వేసి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. 

కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి, లౌకిక వాదానికి తూట్లు పొడిచే కుట్రలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టడమే బీజేపీ పని అని ఫైర్ అయ్యారు. కుల గణన బిల్లును కేంద్రం అడ్డుకుందని, దీన్ని కాంగ్రెస్ కార్యకర్తలు జనాల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.