జగిత్యాల: యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరకట్నం కోసం వైష్ణవిని హత్య చేయడానికి ఆమె భర్త హరిబాబును ప్రేరేపించిన అతని తల్లి లక్ష్మి, అన్నలు ఆనంద్, అశోక్‌ను గురువారం (మార్చి 19) అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు మెట్పల్లి డీఎస్పీ రాములు తెలిపారు.
వైష్ణవి కొంతకాలంగా యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుంది. 10 నెలల క్రితం హరిబాబుతో పరిచయం ప్రేమగా మారి, 2025 మే 29న వెంకటాపూర్ శివారులోని వేంకటేశ్వర ఆలయంలో వివాహం చేసుకున్నారు. మొదట రూ.5 లక్షలు ఇచ్చినప్పటికీ, మరో రూ.5 లక్షలు తేవాలని హరిబాబు తరచూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వేధింపులకు అతని తల్లి లక్ష్మి, అన్నలు ఆనంద్, అశోక్ సహకరించారు. నాలుగు నెలల గర్భిణిగా ఉన్నా వైష్ణవిపై కూడా వేధింపులు కొనసాగాయి.
►ALSO READ | ఆసిఫాబాద్ జిల్లాలో యువతులను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు.. ముగ్గురు అరెస్ట్
ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి సమయంలో గదిలో గొడవ జరిగి, హరిబాబు కత్తితో దాడి చేశాడు. ఉదయం అతడు పరారవ్వగా, గదిలో రక్తపు మడుగులో ఉన్న వైష్ణవిని చూసిన కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
పరారీలో ఉన్న హరిబాబును కోనరావుపేట ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు బుధవారం (మార్చి 18) అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో వైష్ణవి భర్త హరిబాబుతో పాటు అతని తల్లి, ఇద్దరు అన్నలపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న హరిబాబు తల్లి లక్ష్మి, అన్నలు అశోక్, ఆనందులను గురువారం (మార్చి 19) అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
