మల్యాల, వెలుగు : నీటికుంటలో మునిగి ఇద్దరు స్టూడెంట్లు చనిపోయారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ కు చెందిన వనం విష్ణు (11), జగిత్యాల జిల్లా టీఆర్ నగర్ కు చెందిన జగన్నాథ్ సుశాంత్ (10) మల్యాలలోని ఇంటిగ్రేటెడ్ బీసీ హాస్టల్ లో ఉంటూ వడ్డెర కాలనీ ఎంపీపీఎస్ లో చదువుతున్నారు.
సోమవారం మధ్యాహ్నం స్కూల్ నుంచి వెళ్లిన ఇద్దరు హాస్టల్ కు రాలేదు. దీంతో స్కూల్, హాస్టల్ సిబ్బంది స్థానికుల సాయంతో చుట్టుపక్కల గాలించారు. కొత్తకుంట సమీపంలో ఇద్దరు స్టూడెంట్ల దుస్తులు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ రాజ్ కుమార్, ఎస్సై సందీప్ ఘటనాస్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో కుంటలో గాలించగా.. ఇద్దరి డెడ్ బాడీలు దొరికాయి.
స్టూడెంట్ల డెడ్ బాడీలను జగిత్యాల ఏరియా హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సత్యప్రసాద్, ఇతర అధికారులు వచ్చి ఘటన వివరాలను తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసుల తెలిపారు. కాగా, హాస్టల్ లో రెండు రోజులుగా నీళ్లు సరిగా రాకపోవడంతో విద్యార్థులు ఈత కొట్టేందుకు కుంట వద్దకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. స్టూడెంట్ల మృతిపై సమగ్ర విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేశారు.
