‘మీరాలం’లో చిక్కుకున్న కార్మికులు సేఫ్

‘మీరాలం’లో చిక్కుకున్న కార్మికులు సేఫ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: అర్ధరాత్రి హైడ్రా ఆపదమిత్ర పాత్ర పోషించింది. మీరాలం చెరువులో చిక్కుకున్న తొమ్మిది మందిని హైడ్రా డీఆర్ ఎఫ్ టీమ్ ​కాపాడింది. మీరాలం ట్యాంక్ మీదుగా నిర్మించనున్న బ్రిడ్జి కోసం సాయిల్ టెస్ట్ చేయాల్సి ఉండగా, ఆదివారం ఉదయం కార్మికులు, ఇంజినీర్లు బోటులో వెళ్లారు. చీకటి పడ్డాక పడ్డాక బోటు ఇంజిన్ ఫెయిల్ ​కావడంతో అక్కడే చిక్కుకుపోయారు. 

మెకానిక్ టీమ్​కు ఫోన్ చేయగా బోటు ఒడ్డుకు వస్తేనే రిపేర్ ​చేయగలమని చెప్పారు. బోటును నెట్టుకొద్దామని ప్రయత్నిస్తే చెరువులో దట్టంగా ఉన్న గుర్రపు డెక్క బోటును ముందుకు కదలనీయలేదు. మరోపక్క చెరువులో మొసళ్లు ఉండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. 

డయల్100కి ఫోన్ చేయగా..హైడ్రా డీఆర్ఎఫ్ కంట్రోల్ రూంకి ఫోన్ వచ్చింది. చెరువు మధ్యలో చిక్కుకుపోయిన వారితో హైడ్రా ఎస్ఎఫ్ఓ జమీల్, హైడ్రా రెస్క్యూ టీమ్ ఇన్​చార్జి స్వామి మాట్లాడారు. టార్చ్ లైట్లతో డీఆర్ఎఫ్ టీమ్స్​కష్టం మీద అక్కడకు చేరుకున్నాయి. తొమ్మిది మందిని సేఫ్​గా బయటికి తీసుకువచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమను కాపాడిన హైడ్రా బృందాలకు ధన్యవాదాలు తెలిపారు.