ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

ఉమ్మడి  నల్గొండ  జిల్లాలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

భారతదేశ ప్రజాస్వామ్యానికి  పట్టుగొమ్మ అయిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గొప్పదినం రిపబ్లిక్ డే అని కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు అన్నారు.  జనవరి 26న సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో రిపబ్లికే డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఆయా జిల్లాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి చెప్పారు. ఆయా జిల్లాల్లో ప్రతిభ చూపిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 

అర్హులందరికీ సంక్షేమ పథకాలు : కలెక్టర్ బి. చంద్రశేఖర్

 నల్గొండ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికీ అందిస్తూ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ బి. చంద్రశేఖర్ సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

అనంతరం ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం మాట్లాడారు. జిల్లాలో 23 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రూ.1016.46 కోట్ల విలువ గల 1,29,385 మెట్రిక్ టన్నుల పత్తిని 55, 770 మంది రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 

అనంతరం స్టాల్స్ ను జిల్లా కలెక్టర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రారంభించి పరిశీలించారు. వివిధ శాఖలలో పనిచేస్తూ ఉత్తమ  సేవలు అందించిన ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు హఫీజ్ ఖాన్, రెవెన్యూ  అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

స్కీమ్స్​లో అర్హులందరికీ లబ్ధి : యాదాద్రి కలెక్టర్​ హనుమంతరావు

యాదాద్రి, వెలుగు: అందరి సహకారంతో యాదాద్రి జిల్లా సమగ్రాభివృద్ధి చెందుతోందని కలెక్టర్​ హనుమంతరావు అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా  బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భువనగిరిలోని కలెక్టరేట్ జూనియర్​ కాలేజీ గ్రౌండ్‌లో  జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసులు గౌరవ వందనం స్వీకరించిన​ అనంతరం ఆయన మాట్లాడారు.

 సంక్షేమ పథకాలను అర్హులకు  అందించడమే లక్ష్యంగా  జిల్లా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. మహాలక్ష్మి స్కీమ్​లో 1.97 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేశారని తెలిపారు. 77,660 మంది రైతులకు రుణమాఫీ చేశామన్నారు.  9,735 ఇందిరమ్మ ఇండ్లు చేయగా అవి వివిధ దశల్లో నిర్మాణం జరుగుతున్నాయన్నారు. 

గంధమల్ల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. స్టూడెంట్స్ ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. 200 మంది పైగా ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు. ప్రభుత్వ విప్​ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, అడిషనల్​కలెక్టర్​ ఏ. భాస్కరరావు(ఐఏఎస్​), ఎస్సీ అక్షాంశ్ యాదవ్, డీఆర్​వో జయమ్మ, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్​ రెడ్డి ఉన్నారు. 

పథకాల అమలులో ప్రథమ స్థానంలో నిలుపుతాం..

  • రిపబ్లిక్ డే వేడుకల్లో  కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా ప్రజల భవిష్యత్ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.  77 వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సోమవారం  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో  ఎస్పీ నరసింహ తో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..   రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా సంవత్సరానికి రూ.118.41 కోట్ల బోనస్ రైతుల ఖాతాలో వడ్ల బోనస్  జమ చేశామన్నారు.  44,165 కొత్త రేషన్ కార్డులను జారీ చేసి 70 వేల సభ్యుల పేర్లను చేర్చినట్లు తెలిపారు.  వివిధ శాఖలకు  చెందిన జిల్లా అధికారులకు, పోలీసులకు, ఉద్యోగులకు,  సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, నరసింహ చారి, ఆర్డీఓ వేణుమాధవ్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు.