ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ షావోమి కంపెనీ ఇండియాలో లేటెస్ట్ రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో (Redmi Pad 2 Pro) టాబ్లెట్‌ను లాంచ్ చేసింది. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని, తక్కువ ధరలో 5G కనెక్టివిటీతో దీన్ని తీసుకువచ్చారు. ఈ ట్యాబ్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇంకా పూర్తిగా మెటల్‌తో తయారైంది, కాబట్టి చేతిలో పట్టుకున్నప్పుడు ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది. 7.5mm మందం, 620 గ్రాముల బరువు ఉంటుంది. అంటే పెద్ద సైజులో ఉన్నా పట్టుకోవడానికి తేలికగానే అనిపిస్తుంది. నీటిని తట్టుకోగల IP53 రేటింగ్ దీనికి లభించింది.
డిస్‌ప్లే చూస్తే దీనికి 12.1 అంగుళాల పెద్ద స్క్రీన్ ఉంది. సినిమాలు చూడటానికి, గేమింగ్‌కు ఈ ట్యాబ్ చాలా బాగుంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రీన్ వాడకం చాలా స్మూత్‌గా ఉంటుంది. డిస్‌ప్లే LCD స్క్రీన్ అయినప్పటికీ, డాల్బీ విజన్ సపోర్ట్ వల్ల కలర్స్ స్పష్టంగా కనిపిస్తాయి. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 3 కూడా వాడారు.
పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఇందులో స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 చిప్‌సెట్ ఉంది. దీనివల్ల ప్రతిరోజు వాడకం కోసం, ఆఫీస్ వర్క్, గేమింగ్ ఎలాంటి సమస్య లేకుండా చేసుకోవచ్చు. ఈ ట్యాబ్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఆప్షన్లతో వస్తోంది. ఆండ్రాయిడ్ 15 HyperOS 2 సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుంది. కంపెనీ దీనికి రాబోయే రోజుల్లో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు ఇస్తామని తెలిపింది. ముఖ్యంగా ఇందులో అనవసరమైన యాప్స్ లేకపోవడం విశేషం.
బ్యాటరీ & ఛార్జింగ్
ఈ టాబ్లెట్‌లో 12,000mAh భారీ కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఒకరోజు కంటే పైగా వస్తుంది. 5G వాడినా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ గంటలపాటు ఉంటుంది. అయితే, దీనికి 33W ఛార్జింగ్ మాత్రమే ఇచ్చారు. పెద్ద బ్యాటరీ కావడంతో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి దాదాపు 2 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది.
