- రాడార్లు ఆపేసి జలసంధిలో ఉత్కంఠభరిత ప్రయాణం
- గోయింగ్ డార్క్ వ్యూహంతో సేఫ్ గా బయటపడ్డ ట్యాంకర్
- యుద్ధం స్టార్టయ్యాక ఈ రూట్లో పయనించిన తొలి నౌక ఇదే
ముంబై: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం సముద్ర మార్గాలను రక్తసిక్తం చేస్తోంది. ఇలాంటి భయానక పరిస్థితుల్లో సౌదీ అరేబియా నుంచి ముడి చమురుతో బయలుదేరిన ‘షెన్‌లాంగ్ సూయజ్‌మాక్స్’ అనే ఆయిల్ ట్యాంకర్ హార్మూజ్ జలసంధిని దాటుకుని సురక్షితంగా ముంబై పోర్టుకు చేరుకుంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ మార్గంలో ప్రయాణించి భారత్‌కు చేరిన మొదటి నౌక ఇదే కావడం విశేషం.
‘గోయింగ్ డార్క్’ వ్యూహం
ఈ నౌక ప్రయాణంలో అత్యంత కీలకమైన ఘట్టం మార్చి 8 న చోటుచేసుకుంది. సౌదీలోని రాస్ తనురా పోర్ట్ నుంచి బయలుదేరిన ఈ నౌక హార్మూజ్ జలసంధిలోకి ప్రవేశించగానే అకస్మాత్తుగా ట్రాకింగ్ సిస్టమ్స్ నుంచి అదృశ్యమైంది. శత్రు దాడుల నుంచి తప్పించుకోవడానికి కెప్టెన్ సుక్షాంత్ సింగ్ సంధు నేతృత్వంలోని సిబ్బంది, నౌకలోని 'ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్' (ఏఐఎస్)ను నిలిపివేశారు. దీనినే ‘గోయింగ్ డార్క్’ అంటారు. సుమారు ఒక రోజంతా చీకటిలోనే ప్రయాణించి ప్రమాదకర ప్రాంతాన్ని దాటిన తర్వాత మరుసటి రోజు మళ్లీ రాడార్లలో ప్రత్యక్షమైంది.
భారతీయ కెప్టెన్ సాహసం
ఈ భారీ ట్యాంకర్‌కు ఓ భారతీయుడు కెప్టెన్‌గా వ్యవహరించడం గమనార్హం. కెప్టెన్ సంధుతో పాటు ఈ నౌకలో ఇండియన్లు, పాకిస్థానీయులు, ఫిలిప్పీన్స్ దేశస్తులతో కలిపి మొత్తం 29 మంది సిబ్బంది ఉన్నారు. గ్రీస్‌కు చెందిన డైనకామ్ ట్యాంకర్ మేనేజ్‌మెంట్ దీనిని నిర్వహిస్తోంది. ఈ నౌక సుమారు 1,35,335 మెట్రిక్ టన్నుల ముడి చమురును మోసుకొచ్చింది.
చమురు ధరలు, భారత ఇంధన భద్రత
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటేశాయి. యుద్ధం కారణంగా సరఫరా నిలిచిపోతుందనే భయాల మధ్య, ఈ నౌక సురక్షితంగా రావడం భారత ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే, భారత్ తన ముడి చమురు, సహజ వాయువు అవసరాల కోసం సగానికి పైగా ఈ హార్మూజ్ జలసంధి మార్గంపైనే ఆధారపడి ఉంది.
