- విద్యార్థినిపై గురుకులంలో అవమానకర వ్యాఖ్యలు
- స్కూల్‌కు అనుమతించకుండా ఇబ్బందులు
- కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలోని తెలంగాణ గురుకుల పాఠశాలలో విద్యార్థినికి వివక్ష ఎదురైంది. బాధిత విద్యార్థిని, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్చారం మండలం నాయిని జలాల్‌పూర్‌కు చెందిన మనస్విని గురుకుల స్కూల్లో 7వ తరగతి చదువుతోంది.
ఫిబ్రవరి 20న ఆమెకు కిడ్నీ లో స్టోన్ సమస్య రావడంతో తల్లిదండ్రులు స్కూల్ నుంచి తీసుకెళ్లి.. మెదక్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకెళ్లారు. వారం రోజుల తర్వాత ఆరోగ్యం మెరుగుపడడంతో తల్లిదండ్రులు ఆమెను తిరిగి స్కూల్‌కు తీసుకొచ్చారు.
అయితే పాఠశాల ఏఎన్‌ఎం ఆశాజ్యోతి తమపై అవమానకర వ్యాఖ్యలు చేశారని మనస్విని ఆరోపించింది. ‘నల్లగా ఉన్నారు, ఏ జంగిల్ నుంచి వచ్చారు, లేబర్ పని చేసే వారికి చదువు ఎందుకు’ అంటూ తల్లిదండ్రులను అవమానపరిచిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనను స్కూల్ నుంచి టీసీ ఇచ్చి పంపించాలని కూడా చెప్పినట్లు పేర్కొంది. అనారోగ్యంతో వాంతులు చేసుకున్న సందర్భంలోనూ నర్సు తనతో దురుసుగా ప్రవర్తించిందని తెలిపింది.
ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన కూడా ఏఎన్‌ఎం వైపే మాట్లాడారని ఆరోపించింది. దీంతో చేసేదేమీ లేక ఇంటికి వెళ్లిపోయినట్లు వాపోయింది. తర్వాత ఈ నెల 6న తల్లిదండ్రులతో కలిసి మళ్లీ స్కూల్‌కు వెళ్లగా కిడ్నీ స్టోన్ పూర్తిగా తగ్గిన తర్వాతే రావాలని ప్రిన్సిపాల్ చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిపారు.
ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నప్పటికీ స్కూల్‌కు అనుమతించడం లేదని మనస్విని కన్నీటి పర్యంతమైంది. గురువారం తల్లిదండ్రులతో కలిసి మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తమ కూతురికి తిరిగి చదువుకునే అవకాశం కల్పించాలని వారు కోరగా, తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
