ఏసీ గదులు వదిలి బయటకు రండి..మూసీ బాధితుల ఆర్తనాదాలు వినిపించడం లేదా? : రాంచందర్ రావు

ఏసీ గదులు వదిలి బయటకు రండి..మూసీ బాధితుల ఆర్తనాదాలు వినిపించడం లేదా? : రాంచందర్ రావు
  • రైతు భరోసా, ఉద్యోగాలేవి? 
  • సీఎం రేవంత్​రెడ్డికి బీజేపీ స్టేట్​ చీఫ్​ రాంచందర్ రావు లేఖ 

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి ఏసీ గదులకే పరిమితమయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు విమర్శించారు. మూసీ బాధితుల ఆర్తనాదాలు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. బయటకొచ్చి గ్రౌండ్ రియాలిటీ చూడాలన్నారు. ఇది ప్రజాపాలన కాదని.. కష్టాల పాలన అని ఆరోపించారు. ఈ మేరకు గురువారం సీఎంకు ఆయన బహిరంగ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల కష్టాలను పట్టించుకోవడం మానేశారని, ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.

రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి, దాన్ని రూ.12 వేలకే పరిమితం చేశారని, అది కూడా సమయానికి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి కొరతతో పంటలు ఎండిపోతున్నాయని, అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వృద్ధాప్య పెన్షన్​ రూ.4,016కు, దివ్యాంగుల పెన్షన్​ను రూ.6,016కు పెంచుతామని చెప్పి మాట తప్పారన్నారు. ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిలు పెండింగ్‌‌‌‌లో ఉండటంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ హామీలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన సుమారు రూ.12 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో వైద్యానికి డబ్బుల్లేక దాదాపు 6,0-70 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. పట్టణాల్లో మున్సిపల్ పాలన అధ్వానంగా తయారైందని, ప్రజలు కుక్కలు, కోతులు, పందుల బెడదతో బయటకు రావడానికే భయపడుతున్నారని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ప్రజల సమస్యలను విస్మరించారని అన్నారు. ఇప్పటికైనా సీఎం స్పందించి, ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.