భూపాలపల్లి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు.. చూసి చూడనట్టుగా ఆఫీసర్లు

భూపాలపల్లి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు.. చూసి చూడనట్టుగా ఆఫీసర్లు
  • టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల వింత ధోరణి 
  • అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో పిటిషన్ వేసిన టీఆర్పీ నాయకులు 

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు:జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. రెసిడెన్షియల్​ ముసుగులో కమర్షియల్​ నిర్మాణాలు చేపడుతున్నారు. స్టిల్ట్ అనుమతులు తీసుకుని సెల్లార్లు తవ్వుతున్నారు. సెల్లార్ నిర్మాణాలపై టీఆర్‌‌‌‌‌‌‌‌పీ నాయకులు హైకోర్టులో పిటిషన్ వేయగా.. అధికారులు నామమాత్రంగా సెల్లార్ వరకు మాత్రమే సీజ్ చేసి చేతులు దులుపుకోవడంపై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. 

మున్సిపాలిటీలో 30 వార్డుల్లో 12,413 ఇండ్లు ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం రోజురోజుకు విస్తరిస్తోంది. అయితే అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాలను ఆదిలోనే అడ్డుకట్ట వేయాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు చూసి చూడనట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు కదులుతున్నారని, ఖాళీ స్థలాలకు కూడా ఇంటి నంబర్లు అమ్ముతూ.. మున్సిపాలిటీ సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ లిస్టుల్లో యజమానులకు బదులు సిబ్బంది సెల్ నంబర్లు కనిపిస్తున్నాయి. మరోవైపు సెట్​బ్యాక్‌‌‌‌‌‌‌‌లు లేకుండా రోడ్లను అక్రమించి ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంటి ప్లానింగ్ కాగితాల్లో మాత్రమే సెట్​ బ్యాక్‌‌‌‌‌‌‌‌లు కనిపిస్తున్నాయి తప్ప, క్షేత్రస్థాయిలో లేవు. 

నేషనల్ హైవే వెంట కూడా నిర్మాణాలు 

నేషనల్ హైవే వెంట కూడా అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అంబేద్కర్ సెంటర్ సమీపంలో సర్వే నంబర్ 317/8, 317/సిలో స్టిల్ట్ + 3 అంతస్తుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. కానీ నిర్మాణదారుడు మెయిన్ రోడ్డుకు సమీపంలో సెల్లార్ తవ్వి అనుమతులకు విరుద్ధంగా భవనం నిర్మించాడు. ఈ విషయంలో మున్సిపాలిటీ, జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీంతో టీఆర్‌‌‌‌‌‌‌‌పీ నాయకులు హైకోర్టుకు వెళ్లారు. కోల్ ప్రభావిత ప్రాంతాల్లో సెల్లార్ నిర్మాణం వల్ల ప్రమాదం జరిగితే సమీప ప్రాంతాలకు నష్టం వాటిల్లుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అనుమతులు లేకుండా సెల్లార్ నిర్మాణాలు చేసిన భవనాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

అధికారులు కేవలం సెల్లార్, పెంట్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లను మాత్రమే సీజ్ చేసి మిగిలిన భవనాన్ని వదిలేశారు. అనుమతుల్లో చూపిన సెట్ బ్యాక్‌‌‌‌‌‌‌‌లు లేకుండానే భవనం నిర్మించి దాంట్లో ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. డీఆర్‌‌‌‌‌‌‌‌ఏ, ఫైర్ ఎన్‌‌‌‌‌‌‌‌ఓసీ, పీసీబీ అనుమతులు లేకుండా ఆస్పత్రి నడుపుతున్నారు. అలాగే కృష్ణా కాలనీలో రిటైర్డ్​ అయి వెళ్లిన సింగరేణి కార్మికుల స్థలాలను కబ్జా చేసి, ఇళ్లు నిర్మిస్తున్నారు. మైసమ్మ కాలనీ, శివాలయం సమీపంలో కోర్టు కేసుల్లో ఉన్న స్థలాల్లోనూ వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. మంజూరునగర్ సమీపంలో నిబంధనలు అతిక్రమించి ఇళ్లు కట్టుతున్నారు. అంబేద్కర్ సెంటర్ సమీపంలో ఓపెనింగ్ అయిన మినీ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌లో లిఫ్ట్ ఏర్పాటు చేయగా.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక శిక్షణకు ఏర్పాటు చేసిన సమయంలో లిఫ్ట్ బెల్ట్ తెగి పడిపోయింది. జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి నాణ్యత లోపాలను పట్టించుకునే వారు లేరు. 

 అనుమతి లేని నిర్మాణాలను గుర్తిస్తున్నాం..

మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది 222 భవనాలకు అనుమతులు ఇచ్చి రూ.1.55 కోట్ల రాబడి సాధించాం. అనుమతులు లేని నిర్మాణాలను గుర్తించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేపట్టి అనుమతులు తీసుకోవాలని చర్యలు తీసుకుంటున్నాం. కోర్టు ఆదేశాల మేరకు సీజ్ చేశాం. మిగతా భవనాలకు అనుమతులు ఉన్నాయి. నిరంతర తనిఖీలు చేపడుతున్నాం. ఇంటి నిర్మాణాలు చేపట్టేవారు తప్పనిసరిగా మున్సిపాలిటీ అనుమతులు తీసుకోవాలి - కమిషనర్ ఉదయ్‌‌‌‌‌‌‌‌కుమార్