- మార్చి 12న మధ్యాహ్నం 12.20 గంటలకు గుట్టకు చేరుకున్న శివప్రతాప్ శుక్లా
- నారసింహుడిని, రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్
యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్న శివప్రతాప్ శుక్లా గురువారం ఫ్యామిలీతో కలిసి యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడిని దర్శించుకున్నారు. హైదరాబాద్‌లోని లోక్‌భవన్ నుంచి ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరిన గవర్నర్ మధ్యాహ్నం 12.20 గంటలకు గుట్టకు చేరుకున్నారు.
ప్రెసిడెన్షియల్ సూట్‌లో ఫ్రెష్ అయిన అనంతరం కొండపైకి చేరుకున్న గవర్నర్‌కు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి స్వాగతం పలుకగా, పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
ప్రధానాలయ ప్రాంగణం వద్ద ఈవో భవానీ శంకర్ స్వాగతం పలుకగా.. తూర్పు రాజగోపురం వద్ద ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రధానాలయంలోకి చేరుకున్న గవర్నర్ మొదట ధ్వజస్తంభానికి మొక్కి గర్భగుడిలోకి వెళ్లారు. సుమారు 15 నిమిషాల పాటు స్వయంభు నారసింహుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ముఖ మంటపంలో అర్చకులు, వేదపండితులు చతుర్వేద ఆశీర్వచనం చేయగా.. చైర్మన్ నర్సింహమూర్తి, ఈవో భవానీ శంకర్ స్వామి వారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు పడి పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని ప్రార్థించినట్లు గవర్నర్ పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా నారసింహుడిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
అనంతరం పక్కనే ఉన్న పర్వత వర్ధినీ సమేత రామలింగేరస్వామిని దర్శించుకొని, ముఖ మండపంలో ఉన్న స్పటిక లింగమూర్తికి పంచామృతాభిషేకం చేశారు. మధ్యాహ్నం 2.20 గంటలకు కొండపై నుంచి ప్రెసిడెన్షియల్ సూట్‌కు చేరుకున్నారు. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్న అనంతరం 3.20 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరారు. కార్యక్రమంలో ఎస్పీ అక్షాంశ్ యాదవ్, డీఎస్పీ శ్రీనివాస్‌నాయుడు ఉన్నారు.
