రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులు జలకళను సంతరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఎల్ నినో ప్రభావం తొలగిపోయి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే బృహత్తర సంకల్పంతో నాగార్జునసాగర్ వేదికగా అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆగస్టు 10వ తేదీన నల్గొండ జిల్లాలోని ప్రసిద్ధ నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలో ఉన్న విజయవిహార్ ఆవరణలో మహా వరుణ యాగం నిర్వహించనున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన వేద పండితులు ఈ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
ఈ మహా వరుణ యాగం కోసం ప్రత్యేకంగా 11 హోమగుండాలను ఏర్పాటు చేశారు. సుమారు 108 మంది వేద పండితులు, ఋత్వికులు ఈ పవిత్ర యాగంలో పాల్గొననున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఈ యాగ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సాగర్ కింద ఉన్న 22 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఆగస్టు 10వ తేదీ మధ్యాహ్నం 3:20 నుంచి 3:24 గంటల మధ్య జరిగే పవిత్ర పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు. శ్రీశైలం నుంచి ఇంకా నాగార్జునసాగర్‌కు పూర్తిస్థాయిలో నీరు చేరాల్సిన తరుణంలో, ప్రభుత్వం చేపట్టిన ఈ వరుణ యాగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
