- రాష్ట్రంలో 13,677
- ప్రైవేట్ బడులుంటే.. ఆడిట్
- డేటా ఇచ్చింది 166 స్కూళ్లే
- ఫీజుల డేటా కేవలం 739 బడులు..
- 12,938 స్కూళ్లు గప్‌చుప్
- నోటీస్ బోర్డుల్లో పెడ్తలే.. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయట్లే
- మేనేజ్‌మెంట్లకు తక్షణమే నోటీసుల జారీకి
- డైరెక్టర్ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: సర్కారు నిబంధనలను బేఖాతరు చేస్తూ పేరెంట్స్ నుంచి అడ్డగోలుగా ఫీజులు దండుకుంటూ కనీసం లెక్కలు చెప్పని ప్రైవేట్ స్కూళ్ల తీరుపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. మూడేండ్ల వార్షిక ఆడిట్ నివేదికలు, ఫీజుల వివరాలను వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయని 13,500 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నది. రెండు నెలల నుంచి వివరాలు ఇవ్వకుండా నాన్చడాన్నీ సీరియస్‌గా తీసుకున్నది.
వెంటనే ఆయా స్కూళ్లకు నోటీసులు ఇవ్వాలని ఈ మేరకు ఆర్జేడీలు, డీఈఓలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో మొత్తం 13,677 గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూళ్లు ఉండగా.. వాటిలో కేవలం 739 బడులు (సుమారు 5 శాతం) మాత్రమే 2026-–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్లాస్ వారీగా ఫీజుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేశాయి. మిగిలిన 12,938 స్కూళ్లు నేటికీ ఫీజుల వివరాలను బహిర్గతం చేయకుండా దాటవేస్తున్నాయి.
ఏ క్లాస్‌కు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో స్కూల్ నోటీస్ బోర్డులో, స్కూల్ అధికారిక వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా ప్రదర్శించాలన్న నిబంధనను మేనేజ్‌మెంట్లు పట్టించుకోవడం లేదు. ఫీజుల దోపిడీ ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే వివరాలను సర్కారు పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం లేదని స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు చెప్తున్నారు.
లెక్కలు చెప్పని 13,511 బడులు..
ఫీజుల వివరాలతో పాటు స్కూళ్ల వార్షిక ఆదాయ వ్యయాల ఆడిట్ లెక్కల సమర్పణలో ప్రైవేట్ బడుల తీరు మరింత ఘోరంగా ఉంది. తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ నిబంధనల ప్రకారం ప్రతి అకాడమిక్ ఇయర్ ముగియగానే ఆడిట్ నివేదికతో కూడిన యాన్యువల్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్టును సమర్పించాల్సి ఉంది.
ఈ క్రమంలో గత మూడేండ్ల డేటాను వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఆదేశాలు జారీచేశారు. 9 జిల్లాల్లో ఒక్క స్కూల్ కూడా ఏ సంవత్సరం డేటానూ అప్‌లోడ్ చేయలేదు. ఆరు జిల్లాలు మాత్రం డబుల్ డిజిట్ స్కూళ్లు వెబ్ పోర్టల్‌లో డేటా పెట్టాయి.
2025-–26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా కేవలం 166 స్కూళ్లు మాత్రమే ఆడిట్ లెక్కలను సర్కారుకు అందించాయి. ఏకంగా 13,511 స్కూళ్లు పైసా లెక్క చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాయి. 2023–-24 ఆడిట్ లెక్కలను 147 స్కూళ్లు ఇవ్వగా.. 2024-–25 ఆడిట్ లెక్కలను 162 స్కూళ్లు ఇచ్చాయి. మిగిలిన స్కూళ్లు మాత్రం సర్కారు ఆదేశాలను ఏ మాత్రం ఖాతర్ చేయడం లేదు.
డెడ్‌లైన్లు దాటినా నిర్లక్ష్యం..
ఫీజుల వివరాలు, ఆడిట్ నివేదికలను సమర్పించేందుకు జులై 30వ తేదీనే ఆఖరి గడువుగా నిర్ణయించినప్పటికీ మేనేజ్‌మెంట్లు స్పందించలేదు. ఆ తర్వాత ఆగస్టు నెలలో పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేసినా ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్లలో ఎలాంటి చలనం రాలేదు. దీంతో సర్కారు ఆదేశాలను లెక్కచేయని ప్రైవేట్ బడులపై విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
నిబంధనలు పాటించని అన్ని స్కూల్ మేనేజ్‌మెంట్లకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేసి.. సంబంధిత నివేదికలను వెంటనే డైరెక్టరేట్‌కు పంపాలని డీఈఓలను ఆదేశించారు. నోటీసులకు సరైన సమాధానం ఇవ్వని, నిబంధనలు పాటించని స్కూళ్లపై గుర్తింపు రద్దుతో సహా కఠిన చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది.
ఫీజుల వివరాలు చెప్పని కొన్ని జిల్లాలు..
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 2,275 స్కూళ్లు ఉంటే.. ఫీజుల వివరాలు అప్‌లోడ్ చేసింది కేవలం 111 స్కూళ్లే. మరో 2,164 స్కూళ్లు చెప్పట్లేదు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 1,968 స్కూళ్లకు గాను కేవలం 26 బడులే ఫీజు లెక్కలు చెప్పాయి.
రంగారెడ్డి జిల్లాలో 2,046 స్కూళ్లు ఉండగా.. కేవలం 12 స్కూళ్లు మాత్రమే వివరాలు ఇచ్చాయి.
సంగారెడ్డి జిల్లాలో 635 స్కూళ్లు ఉంటే.. కేవలం 2 బడులే వివరాలు సమర్పించగా, 633 స్కూళ్లు వివరాలు ఇవ్వలేదు.
ఆడిట్ వివరాలివ్వని టాప్ 5 జిల్లాలు (2025-26)
జిల్లా పేరు మొత్తం స్కూళ్లు ఆడిట్ సమర్పించినవి పెండింగ్‌లో ఉన్నవి
హైదరాబాద్ 2,275 15 2,260
రంగారెడ్డి 2,046 7 2,039
మేడ్చల్-మల్కాజిగిరి 1,968 16 1,952
సంగారెడ్డి 635 0 635
నిజామాబాద్ 588 25 563
