ప్రైమరీ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులకు మినిమమ్ బేసిక్స్ లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులలో.. వందలో 82 మంది విద్యార్థులకు కనీస పరిజ్ఞానం ఉండటం లేదని ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) అనే సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. అంతే కాకుండా 79 శాతం మందికి తెలుగు, ఇంగ్లీష్ చదవటం, రాయటం రావటం లేదని తేలింది.
2025-26 విద్యా సంవత్సరం నవంబర్ 25 నుంచి 30 మధ్యలో జరిపిన అధ్యయనం ద్వారా ఈ విషయాలు వెల్లడించింది సంస్థ. ఈ రిపోర్టుకు సంబంధించిన ఫలితాలను తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (SCERT) ఇటీవలే విడుదల చేసింది.
ఈ అధ్యయనం ముఖ్యఉద్దేశం 1 నుంచి 5 వ తరగతి విద్యార్థులలో ఉన్న అక్షరాస్యతను అంచనా వేయడం. రాయటం, చదవటంతో పాటు లెక్కల్లో పిల్లల విశ్లేషణ ఎలా ఉందో తెలుసుకోవడంలో భాగంగా ఈ స్టడీ కండక్ట్ చేశారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దు తో పాటు గణితంలోని వివిధ అంశాలపై పిల్లలకు పరీక్షలు నిర్వహించారు.
3,4వ తరగతి విద్యార్థుల పరిస్థితి:
4వ తరగతి స్టూడెంట్స్ భాగహారం (డివిజన్) చేయడంలో 80 శాతం మంది ఫెయిల్ అయ్యారు. అదే క్రమంలో గుణకారం (మల్టిప్లికేషన్) చేయడంలో 64 శాతం మందికి బేసిక్స్ లేనట్లు రిపోర్టు ద్వారా తెలుస్తోంది. 75 శాతం మంది విద్యార్థులకు ఇంగ్లీష్ బేసిక్స్ లేనట్లు వెల్లడించారు. ఇటు 3వ తరగతి స్టూడెంట్స్ లో 88 శాతం మంది చిన్న చిన్న డివిజన్స్ కూడా చేయలేకపోతున్నారు. 66.1 శాతం మంది కూడికలు, 48.5 శాతం మంది తీసివేతలను ఈజీగా చేయగలిగినట్లు రిపోర్టు వెల్లడించింది.
ఫిఫ్త్ క్లాస్ విద్యార్థుల స్కిల్స్ పై ఆందోళన:
5వ తరగతి విద్యార్థులలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. 70 శాతం మంది విద్యార్థులకు ఇంగ్లీష్ బేసిక్ నాలెడ్జ్ లేకపోవటమే కాకుండా చిన్న చిన్న డివిజన్స్ కూడా చేయలేకపోతున్నారు. 60 శాతం మంది మల్టిప్లికేషన్స్ చేయడం లేదు. లెక్కల్లో కూడా పూర్ పర్ఫామెన్స్ చూపిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. నంబర్స్ లెక్కించడం, చదవటం, రాయటం, చిన్న చిన్న లెక్కలు చేయడంలో కూడా ఫెయిల్ అవుతున్నట్లు వెల్లడయ్యింది. ఉదాహరణకు 9,999 అనే నెంబర్ ను చదవలేకపోతున్నట్లు రిపోర్టు ద్వారా తెలుస్తోంది.
లాంగ్వేజ్ స్కిల్స్:
భాషా పరిజ్ఞానంలో కూడా విద్యార్థులు వెనకబడినట్లు రిపోర్టు వెల్లడించింది. 65 శాతం మందికి తెలుగు, ఉర్దూ చదవటానికి రావటం లేదని తెలుస్తోంది. ఇంగ్లీష్ లో ఏదైనా టాస్క్ ఇస్తే చేయలేకపోతున్నారని.. బేసికల్ సౌండ్స్ ను కూడా ఉచ్చరించలేకపోతున్నట్లు రిపోర్టు ఆధారంగా తెలిసిన సమాచారం.
కొంత మంది విద్యార్థులకు కట్ అనే పదలో క అనే శబ్దాన్ని గుర్తించలేకపోవడం ఆందోళన కలిగించే అంశం. అదే విధంగా Raju has seven marbles. He loses two marbles. How many marbles does Raju have? అనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోతున్నట్లు అధ్యయనంలో తేలింది.
ప్రైమరీ స్కూల్స్ లో ఫలితాలు పేలవంగా ఉన్నప్పటికీ, బేస్‌లైన్ కంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. తెలుగు, ఉర్దూ చదవడం.. రాయడంలో విద్యార్థుల సామర్థ్యం 9.9% నుండి 20.9%కి పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది. ఇంగ్లీష్ చదవడం, రాయడం 7.5% నుంచి 17.2%కి మెరుగుపడగా.. మ్యాథ్స్ సామర్థ్యం 6.5% నుండి 16.9% పెరిగినట్లు స్టడీ ద్వారా తెలుస్తోంది. ఈ ఫలితాలు కాస్త ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ, ఇది సరిపోదని SCERT హెచ్చరించింది. బేస్‌లైన్ లో పురోగతి ఉన్నప్పటికీ, మొత్తం సామర్థ్య స్థాయి తక్కువగానే ఉందని.. మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉన్నట్లు స్టేట్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వెల్లడించింది.
