హడలెత్తిస్తున్న పులి.. బోనుకు చిక్కకుండా తెలివిగా తప్పించుకుంటున్న పెద్దపులి

హడలెత్తిస్తున్న పులి.. బోనుకు చిక్కకుండా తెలివిగా తప్పించుకుంటున్న పెద్దపులి

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో సంచరిస్తున్న పెద్దపులి 14 రోజులుగా  కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పెద్దపులి తెలివిగా సంచరిస్తోంది.  ఆవు కళేబరం వద్దకు వెళ్లి తిని వెళుతోంది. మేకను ఎరగా వేసి బోను ఏర్పాటు చేసినా ఆ వైపునకు వెళ్లడం లేదు.  ఇప్పటివరకూ రెండు ఆవులు, నాలుగు దూడలతో పాటు ఓ కుక్కను చంపివేసింది. ప్రస్తుతం దత్తాయిపల్లి పరిధిలోని గుట్టలపై మగపులి ఉందని గుర్తించారు. ఆవు కళేబరం వద్ద ఏర్పాటు చేసిన ట్రాక్​ కెమెరాకు పెద్దపులి చిక్కింది.  

నాలుగేండ్ల వయసున్న పెద్దపులి ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి యానిమాల్ ట్రాకర్స్ టీమ్ ఆధ్వర్యంలో థర్మల్ డ్రోన్ కెమెరాతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మేకలను ఎరగా పెట్టి వేర్వేరు చోట్ల రెండు బోనులను ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి కూడా ఆవు కళేబరం వద్దకు వచ్చిన పెద్దపులి దానిని 25 శాతానికి పైగా తినేసి వెళ్లిన దృశ్యాలు ట్రాక్​ కెమెరాకు చిక్కాయి.

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లాలో పది రోజులుగా సంచరిస్తున్న పులికి మనుషులపై దాడి చేసే స్వభావం ఉండదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని యాదగిరిగుట్ట డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు తెలిపారు. తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామంలో పులి దాడితో  లేగదూడ చనిపోయిన ప్రదేశాన్ని బుధవారం ఆయన సందర్శించారు. గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పులి సంచారం నేపథ్యంలో ప్రజల భద్రత, రైతులు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.