మునుగోడు, వెలుగు: తమ పొలాలకు సాగునీరు అందడం లేదని సోమవారం మునుగోడు మండలంలోని 17 గ్రామాల రైతులు మండలంలోని మార్కెట్ యార్డ్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ మునుగోడు ప్రాంతానికి బ్రాహ్మణ వెల్లంల లోని ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి 7 ఆర్ కాల్వ నుంచి కిష్టాపురం కాలువ ద్వారా మునుగోడు ప్రాంతంలోని 17 గ్రామాలకు సాగునీరు అందుతుందని భావించామని కానీ, ఉదయ సముద్రం నుంచి కాలువలు పూర్తికాక సాగునీరు అందక తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి ఇతర నియోజకవర్గాలకు ఎలాంటి నిబంధనలు లేకుండా నీరు వెళుతుందని కానీ మునుగోడు ప్రాంతానికి ప్రభుత్వం నీళ్లు అందివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు కు వెంటనే సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని, లేదంటే ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గట్టుపల్లి నర్సిరెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురజా రామచంద్రం, మాజీ ఎంపీపీ పోలగోని సత్యం, మాజీ జెడ్పిటిసి అంజయ్య, ఇప్పర్తి మాజీ సర్పంచ్ బూడిద లింగయ్య యాదవ్ పాల్గొన్నారు.
