ఎన్నికల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించండి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఎన్నికల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించండి :  కలెక్టర్ ఇలా త్రిపాఠి
  • జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కలెక్టర్ ఇలా త్రిపాఠి

బాన్సువాడ, వెలుగు:  మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు ఆదేశించారు. బుధవారం బాన్సువాడలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు.  మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, ఎన్నికల విధుల పట్ల పూర్తి జాగ్రత్తతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. మొదటి రోజు ఆయా డివిజన్లు, వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.  అభ్యర్థులు అన్ని వివరాలతో నామినేషన్ పత్రాలను సక్రమంగా దాఖలు చేసేలా హెల్ప్ డెస్క్ ద్వారా అవగాహన కల్పించాలని, వారి సందేహాలను నివృత్తి చేయాలని తెలిపారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళిని   పాటిస్తూ, ఎలాంటి పొరపాట్లు జరగకుండా  పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ఎన్నికల సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని  ఆదేశించారు.  ఈ నెల 30వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు సంబంధిత మున్సిపాలిటీ పరిధిలోని ఏదైనా డివిజన్, వార్డులో ఓటరుగా నమోదై ఉండవచ్చని తెలిపారు. అయితే ప్రతిపాదకులు (ప్రపోజర్స్) మాత్రం అదే డివిజన్, వార్డుకు చెందిన ఓటరై ఉండాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు తదితరులు పాల్గొన్నారు.