కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌‌ ఏమైంది ? : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌‌ ఏమైంది ? : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ
  •     బీసీల అఖిలపక్ష సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు

అంబర్పేట్, వెలుగు:  ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలపై అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టత ఇవ్వాలని  తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.  

ఆదివారం నగరంలోని ఒక హోటల్‌‌లో బీసీ డిక్లరేషన్ అంశంపై బీసీ సంఘాల నేతలు, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో  అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటిదాకా కనీసం 3 వేల కోట్లు కూడా ఖర్చు చేయకపోవడం దారుణమన్నారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ, కాంట్రాక్టు రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల హామీని తుంగలో తొక్కారన్నారు. 

బీసీ సబ్‌‌ప్లాన్, బీసీ అత్యాచార నిరోధక చట్టం, ఎంబీసీ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు వంటి అంశాల్లో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ‘బీసీ గర్జన’ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నేత వి. హనుమంతరావు, బీసీ జేఏసీ కన్వీనర్ గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.