- ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
వర్ని, వెలుగు: నిరుపేదలకు సొంతిల్లు, విద్య, వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం వర్ని మండలంలోని శ్రీనగర్ లో అంగన్వాడీ భవన నిర్మాణానికి, రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో రూ. 20లక్షలతో నిర్మిస్తున్న జనరల్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడ లేని విధంగా కేవలం బాన్సువాడ నియోజకవర్గం లో 11వేల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేశామన్నారు.
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతులకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సీతా రామరాజు, తహసీల్దార్ తారాబాయి, ఎంపీడీవో బాల గంగాధర్, ఏఈ పవన్, ఏఎంసీ చైర్మన్ సురేశ్ బాబా, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అరుణ్ కుమార్, మాజీ జడ్పీటీసీ గంగారాం, మాజీ ఎంపీటీసీ అనిల్ పటేల్, రాయకూర్ మాజీ విండో సెక్రటరీ గంగారాం, నాయకులు నాగేందర్, రాములు, అధికారులు పాల్గొన్నారు.
