2026 ప్రారంభం నుంచి భారత ఐటీ ఇండెక్స్ ఊహించని కుదుపునకు లోనవుతోంది. కేవలం రెండున్నర నెలల్లోనే ఈ ఇండెక్స్ ఏకంగా 23% పైగా పతనమైంది. ముఖ్యంగా AI వల్ల ఐటీ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. అయితే ఈ భారీ పతనం తర్వాత ఇప్పుడు ఐటీ స్టాక్స్ కొనే సమయం వచ్చిందా? మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారనే ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
ప్రస్తుత పతనం తర్వాత ఐటీ దిగ్గజాల వాల్యుయేషన్లు చాలా ఆకర్షణీయంగా మారాయని కోటక్ నియో నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చాలా కంపెనీలు తమ 10 ఏళ్ల సగటు పీఈ కంటే తక్కువ ధరకే లభిస్తున్నాయని చెప్పారు. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా వంటి లార్జ్-క్యాప్ కంపెనీలు దీర్ఘకాలిక పెట్టుబడికి మంచి అవకాశాలుగా కనిపిస్తున్నాయి. రూపాయి విలువ తగ్గడం ఐటీ కంపెనీలకు లాభిస్తుందని, అందుకే ఈ క్లిష్ట సమయంలో మిడ్-క్యాప్ కంటే లార్జ్-క్యాప్ కంపెనీలపై దృష్టి పెట్టడం ఉత్తమమని వారు సూచిస్తున్నారు.
అయితే విప్రో విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జెఫరీస్ వంటి ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు విప్రోపై ప్రతికూల రేటింగ్ ఇచ్చాయి. రాబోయే రెండేళ్లలో విప్రో ఆదాయ వృద్ధి ఇతర కంపెనీల కంటే తక్కువగా ఉంటుందని, షేర్ ధర మరో 8% వరకు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించాయి. మరోవైపు నువామా మాత్రం టాప్-10 ఐటీ కంపెనీలన్నింటిపై సానుకూలంగా ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్, ఎల్‌టిఐ మైండ్‌ట్రీ, పర్సిస్టెంట్ వంటి స్టాక్స్‌ను కూడా కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేస్తోంది.
ఐటీ రంగంలో ఇప్పుడే పెట్టుబడి పెట్టడం సరికాదని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా తర్వాత ఐటీ కంపెనీల వృద్ధి రేటు గణనీయంగా తగ్గిందని, ప్రస్తుతం లార్జ్-క్యాప్ కంపెనీలు కేవలం 1-3% వృద్ధిని మాత్రమే నమోదు చేస్తున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ఏఐ ప్రభావం వల్ల భవిష్యత్తులో ఐటీ కంపెనీల ఆదాయం మరింత తగ్గే ప్రమాదం ఉందని, అందుకే షేర్ ధరలు పెరిగే అవకాశం తక్కువని వీరి వాదన. సింపుల్ గా చెప్పాలంటే.. మార్కెట్‌లో ఇప్పుడు చవకగా దొరుకుతున్నాయని కొనేవారు కొందరుంటే, ఏఐ ముప్పు ఇంకా ముగియలేదని భయపడేవారు మరికొందరు. మీ పెట్టుబడి లక్ష్యం దీర్ఘకాలికమైతేనే ఐటీ రంగం వైపు చూడటం మంచిదని బ్రోకరేజ్ సంస్థల అంచనాలు చెబుతున్నాయి.
