చారిత్రక ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ సత్య శారద

చారిత్రక ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి :  కలెక్టర్ సత్య శారద

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ లోని చారిత్రక దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. బుధవారం హనుమకొండలోని కుడా ఆఫీస్​లో వరంగల్ కోటలో ఏర్పాటు చేయనున్న పురావస్తు మ్యూజియం అభివృద్ధి పనులపై పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్ రావు, ఇతర ఆఫీసర్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజియం అభివృద్ధి, వారసత్వ సంపద పరిరక్షణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.

మొగిలిచర్లలోని ఏకవీర దేవాలయ పునరుద్ధరణ, శాయంపేటలోని పాంచాలరాయ ఆలయ అభివృద్ధి, వరంగల్ కోటలోని శంభుని గుడి పునరుద్ధరణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. అనంతరం అర్జున్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వరంగల్ పురావస్తు మ్యూజియంను వరంగల్ కోటలో కొత్తగా నిర్మించిన భవనానికి తరలించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కాగా, కుడా వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్‌పాయ్, సీపీవో అజిత్ రెడ్డి, పురావస్తు శాఖ అధికారులు, టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య, తదితరులతో వరంగల్‌ను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే దిశగా చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.