అనారోగ్యంతో కేయూ మాజీ వీసీ లింగమూర్తి మృతి

అనారోగ్యంతో కేయూ  మాజీ వీసీ లింగమూర్తి మృతి

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ, ఎకనామిక్స్ రిటైర్డ్  ప్రొఫెసర్  నాగిశెట్టి లింగమూర్తి(75) శనివారం మధ్యాహ్నం చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హనుమకొండ భీమారం బ్యాంక్  కాలనీలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1952 జూన్  28న జన్మించిన ఆయన 1985 నుంచి 2010 వరకు కాకతీయ యూనివర్సిటీలో 25 ఏండ్ల పాటు వివిధ హోదాల్లో పని చేశారు. 

1985లో పబ్లికేషన్  సెల్  ఇన్​చార్జిగా చేరిన ఆయన ఎకనామిక్స్  హెచ్​వోడీగా, ఎగ్జామినేషన్స్  కంట్రోలర్ గా, 2007 నుంచి 2010 వరకు కేయూ వీసీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009–10లో నిజామాబాద్  తెలంగాణ యూనివర్సిటీ ఇన్​చార్జి వీసీగా పని చేశారు. 2011లో రిటైర్  అయ్యారు. లింగమూర్తికి భార్య, ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. కేయూకు ఇంజినీరింగ్  కాలేజీ తీసుకొచ్చేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆయన మృతి పట్ల కేయూ వీసీ ప్రొఫెసర్​ కె ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్  వి.రామచంద్రం, వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం హనుమకొండలోని పోచమ్మకుంట శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.