- జ్వరం రావడంతో హాస్పిటల్లో చేరిక
- భార్యాభర్తల మధ్య గొడవలతో అఘాయిత్యం
- ములుగు జిల్లా తాడ్వాయిలో ఘటన
తాడ్వాయి, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన మర్రి ముకుందం(35) ఎనిమిదేండ్ల కింద అదే గ్రామానికి చెందిన బందెల మానసను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏడాది నుంచి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మానస పుట్టింటికి వెళ్లి పోయింది.
భార్య కాపురానికి రాకపోవడంతో ముకుందం మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో రెండు రోజుల నుంచి కాళ్లు, చేతులు గుంజుతున్నాయని తల్లి ఎల్లమ్మకు చెప్పాడు. ఆమె 108లో తాడ్వాయి ప్రభుత్వ ఆస్పత్రికి శుక్రవారం రాత్రి తీసుకొచ్చింది. రాత్రి వైద్యం చేయించుకొని ఆస్పత్రిలోనే పడుకున్నారు. తల్లి నీళ్ల కోసం బయటకు వెళ్లగానే ముకుందం ఆస్పత్రి రూమ్ తలుపులు వేసుకొని తన దగ్గర ఉన్న కండువాతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గమనించిన తల్లి అరవడంతో, ఏఎన్ఎం పోలీసులకు సమాచారం అందించింది. తలుపు పగలగొట్టి కొన ఊపిరితో ఉన్న ముకుందంను ములుగు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
