సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జగిత్యాల జిల్లాలో ఓ పోలీస్ ను బెదిరించి రూ. 95 వేలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. బాధితుడి జగిత్యాల పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే.. ఇటీవల ఏఎస్ ఐ ఫోన్ కు ఓ వీడియో కాల్ వచ్చింది. ఆ కాల్ రికార్డ్ చేసి మార్ఫింగ్ తో సోషల్ మీడియాలో పెడతామని ఏఎస్ఐని బెదిరించారు. ఇలా బ్లాక్ మెయిల్ చేసి ఏఎస్ఐ నుంచి రూ. 95,500 బ్యాంకు ఖాతాలో వేసుకున్నారు కేటుగాళ్లు. దీంతో జగిత్యాల పట్టణ పీఎస్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన జగిత్యాల పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒక్క సెల్ ఫోన్ తో ఇంట్లో కూర్చొని డబ్బు కాజేస్తున్నారు కేటుగాళ్లు. క్షణాల్లో డబ్బు మొత్తం మాయం చేస్తున్నారు. అత్యాశతోనే చాలా మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారని చెప్పారు. మన అప్రమత్తతే మనల్ని కాపాడుతుంది. తెలంగాణలో బాధితులు రోజుకు రూ. 4 కోట్ల రూపాయలు సైబర్ మోసాల ద్వారా కోల్పోతున్నారని టీజీ సీఎస్ బీ డైరెక్టర్ శిఖాగోయల్ ఇటీవల తెలిపారు. సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా పెరిగినప్పటికీ తెలంగాణలో సెప్టెంబర్ వరకు 8 శాతం తగ్గాయన్నారు.
