పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన హారర్–కామెడీ ‘ది రాజా సాబ్’.. ఓటీటీ వివరాలు బయటకొచ్చాయి. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 9న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో మిక్స్డ్ టాక్‌ను ఎదుర్కొన్నప్పటికీ, ఓటీటీ హక్కులకు మాత్రం మంచి ధర పలికినట్లు సమాచారం.
బాక్సాఫీస్ పరంగా చూస్తే, ‘ది రాజా సాబ్’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అయితే, ఈ సినిమా కోసం మేకర్స్ పెట్టిన భారీ బడ్జెట్ కారణంగా నిర్మాతకు నష్టాలు తప్పలేదన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
సినిమా విడుదలైన తొలి రోజే రూ. 112 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది. కానీ నెగటివ్ రివ్యూల ప్రభావంతో ఆ తర్వాత రోజుల్లో వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. విడుదలైన 17వ రోజుకు, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.250 కోట్లకు పైగా గ్రాస్, ఇండియాలో రూ.143.08 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
భారీ ధరకు ‘రాజా సాబ్’ OTT హక్కులు
‘ది రాజా సాబ్’ ఓటీటీ డీల్ ఖరారైంది. రిలీజ్‌కి ముందు ఓటీటీ రైట్స్ అమ్ముడు పోలేదని సమాచారం. జియో హాట్‌స్టార్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రూ.80 కోట్లు అని నివేదికలు చెబుతున్నాయి. ఇది అన్ని భాషల హక్కులకు సంబంధించిన డీల్ కావడం విశేషం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రాజాసాబ్ స్ట్రీమింగ్ కానుంది. ప్రభాస్ రేంజ్ మూవీకిది తక్కువే అయినా, సినిమా డిజాస్టర్ కారణంగా ఈ స్థాయిలో వచ్చినా అది బెటర్ అనే చెప్పొచ్చు.
OTT ప్రత్యేక ఒప్పందం హైలైట్..
ఈ OTT డీల్‌లో ఒక ప్రత్యేక నిబంధన కూడా ఉంది. సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల మార్క్ దాటితే, ఆ తర్వాత వచ్చే ప్రతి రూ. 100 కోట్ల వసూళ్లకు నిర్మాతలకు రూ.10 కోట్లు అదనంగా చెల్లించే ఒప్పందం ఉంది. ప్రస్తుతం సినిమా రూ. 250 కోట్లకు పైగా వసూలు చేయడంతో, ఈ డీల్ నిర్మాతలకు లాభదాయకంగా మారినట్లు తెలుస్తోంది. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న రాజా సాబ్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని టాక్. అయితే, OTT రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బడ్జెట్ & బాక్సాఫీస్ పరిస్థితి
‘ది రాజా సాబ్’ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ చిత్రానికి రూ. 400 కోట్లకు పైగా ఖర్చయిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రారంభ రోజుల్లో మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ, మిక్సెడ్ టాక్ కారణంగా తర్వాత కలెక్షన్లు తగ్గాయి. అయితే, ఈ ఓటీటీ ప్రత్యేక ఒప్పందం వల్ల నిర్మాతకు కొంత వరకు రిలీఫ్ లభించినప్పటికీ, రూ.400 కోట్ల బడ్జెట్ పెట్టడమే ఈ ప్రాజెక్ట్‌కు పెద్ద మైనస్‌గా మారిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఓవరాల్‌గా, ఈ సినిమా ద్వారా నిర్మాతకు రూ. 150 కోట్లకు పైగా నష్టం వచ్చి ఉండొచ్చని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇది ఇటీవలి కాలంలో వచ్చిన అతిపెద్ద నష్టాల్లో ఒకటిగా చెప్పుకుంటున్నారు. అయితే, ఈ లెక్కలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అంచనాలే తప్ప, అధికారికంగా ధృవీకరించబడినవి కావని గమనించాల్సి ఉంది.
