యూరప్ దేశాలతో కుదిరిన 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'.. ఇండియాలో రేట్లు తగ్గే వస్తువులు ఇవే..

యూరప్ దేశాలతో కుదిరిన 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'.. ఇండియాలో రేట్లు తగ్గే వస్తువులు ఇవే..

భారతదేశ ఆర్థిక చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కీలక ట్రేడ్ డీల్ కుదిరింది. ప్రధాని మోడీ, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు. ఇప్పుడు దీనిని ఆర్థిక నిపుణులు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌గా పేర్కొంటున్నారు. ఈ ఒప్పందం కేవలం వ్యాపారాలకే కాకుండా, సామాన్య భారతీయ వినియోగదారులకు కూడా కొత్త అవకాశాలను, చాలా వస్తువులపై తగ్గిన రేట్ల వల్ల ప్రయోజనాలను తీసుకురానుంది.

ఈ ఒప్పందంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశారు. గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించేందుకు భారత్ చేస్తున్న కృషికి మద్దతుగా యూరోపియన్ యూనియన్ రాబోయే రెండేళ్లలో దాదాపు రూ.4వేల 500 కోట్లు భారీ నిధిని కేటాయించింది. దీనివల్ల మన దేశంలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. అలాగే డిజిటల్ ట్రేడ్ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఆన్‌లైన్ వ్యాపారాల్లో పారదర్శకతను, భద్రతను పెంచుతుంది.

యూరోపియన్ ట్రేడ్‌మార్క్‌లు, ఇండస్ట్రియల్ డిజైన్లు, కాపీరైట్‌లకు ఈ ఒప్పందం ద్వారా గట్టి రక్షణ లభించనుంది. ముఖ్యంగా సర్వీస్ ఇండస్ట్రీలో భారీ మార్పులు రాబోతున్నాయి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వంటి ఫైనాన్షియల్ సేవలు, సముద్ర రవాణా సేవల్లో యూరోపియన్ సంస్థలకు భారత్ ప్రాధాన్యత ఇవ్వనుంది. దీనివల్ల అంతర్జాతీయ స్థాయి సేవలు భారతీయులకు అందుబాటులోకి రావడమే కాకుండా, కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ALSO READ : భారతీయ విద్యార్థులకు డ్రీమ్ డెస్టినేషన్ కెనడా: ఇమ్మిగ్రేషన్ రూల్స్ మార్చినా తగ్గని క్రేజ్.. ఎందుకంటే..?

చిన్న పరిశ్రమలకు చేయూత.. 
ఈ డీల్‌లో ఎంఎస్ఎంఈ రంగానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక 'కాంటాక్ట్ పాయింట్లు' ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా భారతీయ చిన్న వ్యాపారులు తమ ఉత్పత్తులను యూరప్ మార్కెట్లకు సులభంగా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. నియంత్రణ అడ్డంకులు తగ్గడం వల్ల వ్యాపారం చేయడం మరింత సులభతరం కాబోతోంది.

వేటి ధరలు తగ్గుతాయి..? 

ఈ ఒప్పందం వల్ల యూరప్ నుంచి దిగుమతి అయ్యే అనేక వస్తువులపై సుంకాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా యూరోపియన్ బ్రాండెడ్ లగ్జరీ కార్లు, వైన్, చీజ్, అధునాతన యంత్రపరికరాల ధరలు తగ్గుతాయని అంచనా. అలాగే యూరప్ నుంచి వచ్చే రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. దీనివల్ల దేశీయ తయారీ రంగానికి అవసరమైన ముడి సరుకుల ఖర్చు తగ్గి, అంతిమంగా వినియోగదారులకు మేలు జరుగుతుంది.

* కెమికల్స్ పై ఉన్న 22 శాతం పన్నులు చాలా వరకు తొలగింపు
* లగ్జరీ కార్లపై పన్నులను కోటా ప్రకారం ఏడాదికి రెండున్నర లక్షల కార్ల వరకు 10 శాతానికి తగ్గింపు
* జ్యూసెస్, ప్రాసెస్డ్ ఆహారాలపై సున్నా పన్ను
* బీర్ ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్స్
* వైన్ ఉత్పత్తులపై పన్ను 20-30 శాతానికి తగ్గింపు
* ఆలివ్ ఆయిల్, మార్గరిన్, ఎంపిక చేసిన నూనె దిగుమతులపై టాక్సులు సున్నా
* విమానాలు, అంతరీక్ష పరికరాలపై దిగుమతి సుంకాలు తగ్గింపు
* యూరప్ నుంచి దిగుమతి అయ్యే మెడికల్ ఎక్విప్మెంట్ లో 90 శాతం వస్తువులపై ఎలాంటి పన్నులు లేవు

ప్రస్తుతానికి ఈ ఒప్పందం ద్వారా ఏ వస్తువుపై నేరుగా పన్నులు పెంచలేదు. కానీ, సేవారంగంలో పెరిగే పోటీ వల్ల కొన్ని రకాల ఫైనాన్షియల్ సర్వీసులు లేదా షిప్పింగ్ ఛార్జీలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. అయితే ఓవరాల్‌గా చూస్తే భారత ఆర్థిక వ్యవస్థకు ఈ ఒప్పందం ఒక బూస్టర్ డోస్ లాంటిదని చెప్పవచ్చు. మెుత్తానికి యూరప్ నుంచి దిగుమతి అయ్యే 93 శాతం వస్తువులపై ట్రేడ్ డీల్ కింద సుంకాలను 10 ఏళ్ల పాటు సున్నాకు తగ్గించారు. అలాగే భారత్ నుంచి ఎగుమతయ్యే 97 శాతం వస్తువులపై పన్నులను తొలగించింది యూరోపియన్ యూనియన్.