వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో అమానుష ఘటన జరిగింది. తన ప్రియుడితో ప్రేమ పెళ్లికి అడ్డొస్తున్నారని కన్న తల్లిదండ్రులను కూతురు చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నర్సుగా పనిచేస్తున్న సురేఖ అనే యువతి ఇంజెక్షన్ ఇచ్చి తల్లిదండ్రులను చంపేసింది. నిందితురాలు సురేఖను పోలీసులు అరెస్ట్ చేశారు.
సురేఖ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. వయసు మీద పడిన కన్నతల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సింది పోయి కన్న కూతురే చంపేసిందని తెలిసి యాచారం గ్రామం ఉలిక్కిపడింది. తల్లిదండ్రులకు కెటామైన్ ఇంజక్షన్ ఇచ్చి చంపినట్లు వైద్యులు గుర్తించారు.
సంగారెడ్డిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో సురేఖ నర్సుగా పనిచేస్తుందని గ్రామస్తులు తెలిపారు. అక్కడే ఒక యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే ఈ ఇద్దరి పెళ్లికి సురేఖ తల్లిదండ్రులు అడ్డు చెప్పారు. అప్పటి నుంచి తల్లిదండ్రులపై సురేఖ ద్వేషం పెంచుకుంది. తల్లిదండ్రులను చంపేసి ఇలా కటకటాల పాలైంది. తల్లిదండ్రుల మృతిపై సురేఖ సోదరుడు అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. కెటామైన్ ఇంజక్షన్ అనస్థీషియా సమయంలో వాడుతారు. ఓవర్ డోస్ అయితే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది.
తల్లిదండ్రులకు ఒళ్లు నొప్పులకు మందు అని చెప్పి ఇద్దరికీ సురేఖ ఈ ఇంజెక్షన్ ఓవర్ డోస్ చేసింది. కొంతసేపటికే ఇద్దరూ చనిపోయారు. సహజ మరణంగా చిత్రీకరించేందుకు సురేఖ ప్రయత్నించింది. అమ్మానాన్న ఉలుకూపలుకూ లేకుండా పడి ఉన్నారని తన అన్నకు సమాచారం ఇచ్చింది. అతను ఇంటికొచ్చి చూడగా తల్లిదండ్రులు ఇద్దరూ విగత జీవులుగా కనిపించారు.
చెల్లి ప్రేమ వ్యవహారం, ఇంట్లో జరుగుతున్న గొడవల కారణంగా సురేఖపై ఆమె అన్నయ్య అశోక్కు అనుమానమొచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా సురేఖను పోలీసులు తమదైన శైలిలో విచారించారు. తన ప్రేమ పెళ్లికి అడ్డుపడుతున్నారనే కోపంతో తల్లిదండ్రులను ఇంజెక్షన్ ఇచ్చి చంపినట్లు సురేఖ పోలీసుల విచారణలో నిజం ఒప్పుకుంది. పోలీసులు సురేఖను అరెస్ట్ చేశారు.
