ఇబ్రహీంపట్నం, వెలుగు: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత కొండిగారి రాములు (90) శుక్రవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లకు చెందిన రాములు తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకంగా పనిచేశారు. అనంతరం పీడీఎస్‌యూలో పనిచేశారు. సీపీఎం తరఫున 1989, 1994లో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఎమ్మెల్యేగా వచ్చిన వేతనంలో అత్యధిక భాగం పార్టీకే కేటాయించి, కేవలం రూ. 1000తోనే కుటుంబాన్ని పోషించారు. రాములు భార్య ముత్యాలమ్మ ఆరు నెలల కిత్రమే మరణించింది. రాములుకు ముగ్గురు కొడుకులు అరుణ్‌కుమార్, కిరణ్ కుమార్, త్రిలోక్ కుమార్ కాగా.. అనారోగ్యం కారణంగా అరుణ్‌కుమార్ గతంలోనే చనిపోయారు.
మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు చనిపోయిన విషయం తెలుసుకున్న ప్రజలు చివరి చూపు కోసం ఇబ్రహీంపట్నం బృందావన్ కాలనీలోని ఇంటి వద్ద క్యూ కట్టారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, డీజీపీ శివధర్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు రాములు భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. కొండిగారి రాములు సేవలు మరువలేనివని కొనియాడారు.
