ప్యాంగాంగ్: దక్షిణ కొరియా, అమెరికా దళాల సైనిక విన్యాసాలకు కౌంటర్‌గా నార్త్ కొరియా అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం గల రాకెట్ లాంచర్లను ప్రయోగించింది. ఉత్తర కొరియో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, ఆయన కూతురు కిమ్ జు ఏ సమక్షంలో శనివారం (మార్చి 14) ఈ ప్రయోగం జరిగింది. రాకెట్లు కొరియా తూర్పు సముద్రంలోని ద్వీప లక్ష్యాన్ని దాదాపు 364.4 కి.మీ దూరంలో 100 శాతం ఖచ్చితత్వంతో ఛేదించాయని నార్త్ కొరియా మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది.
ఈ రాకెట్లు 420 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న శత్రువులపై దాడి చేయగలవని పేర్కొంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా భగభగమంటున్న వేళ నార్త్ కొరియా ఏకంగా అణ్వాయుధాలను మోసుకెళ్లే రాకెట్లను ప్రయోగించడం ప్రపంచదేశాల్లో చర్చనీయాంశంగా మారింది.
నార్త్ కొరియా రాకెట్ లాంచర్ ప్రయోగాన్ని దక్షిణ కొరియా సైన్యం ధృవీకరించింది. ఉత్తర కొరియా తన తూర్పు తీరంలో సముద్రం వైపు 10 కి పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని తెలిపింది. ఆదివారం (మార్చి 15) మధ్యాహ్నం 1:20 గంటల ప్రాంతంలో రాజధాని ప్యోంగ్యాంగ్ సమీపంలోని ఓ ప్రాంతం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించారని వెల్లడించింది. ఆ రాకెట్లు దాదాపు 350 కిలోమీటర్లు ప్రయాణించాయని తెలిపింది.
►ALSO READ | నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో బస్సు బోల్తా పడి ఏడుగురు భారతీయులు మృతి
అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలను రెచ్చగొట్టే, యుద్ధ రిహార్సల్ అని విమర్శించారు. ఇది ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. దక్షిణ కొరియా, అమెరికా ఈ విన్యాసాలు పూర్తిగా రక్షణాత్మకమైనవని చెప్పుకుంటున్నాయి. ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే ముప్పుకు వ్యతిరేకంగా సంసిద్ధతను పరీక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొంటున్నాయి.
