కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 2026, ఏప్రిల్ 23, 29వ తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఆదివారం (మార్చి 15) కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రెండు దశల్లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 2026, మే 4న కౌంటింగ్, ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో 2011 నుంచి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అధికారంలో ఉంది. కమ్యూనిస్టుల కంచు కోటలను బద్దలు కొడుతూ వరుసగా మూడుసార్లు టీఎంసీ ఘన విజయం సాధించింది. నాలుగో సారి కూడా విజయమే లక్ష్యంగా టీఎంసీ వ్యూహాలు రచిస్తోంది.
మరోవైపు పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎలాగైనా కాషాయ జెండా రెపరెపలాడించాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే గత కొంత కాలంగా బెంగాల్లో ఓట్ షేర్ ను బీజేపీ క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. బెంగాల్ లో విజయం కోసం ప్రధాని మోడీ, అమిత్ షా వంటి బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. దీంతో టీఎంసీ, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది.
బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివరాలు
1. 2026, మార్చి 30న నోటిఫికేషన్
2. ఏప్రిల్ 6న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ
3. 2026, ఏప్రిల్ 23 (మొదటి దశ)
4. 2026, ఏప్రిల్ 29 (రెండవ దశ)
5.2026, మే 4న కౌంటింగ్, ఫలితాల విడుదల
