MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ట్రేడ్ కావడం కూడా ఈ చర్చను మరింత వేడెక్కిస్తోంది. ధోనీ వీడ్కోలుపై మాజీ క్రికెటర్ రాబిన్ ఉత్తప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. మిస్టల్ కూల్ పాత్ర గత సీజన్లతో పోలిస్తే ఈసారి కొంత భిన్నంగా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ సీజన్ ధోనీకి ఐపీఎల్‌లో చివరి సీజన్ కావొచ్చని కూడా పేర్కొన్నారు.
స్టార్ స్పోర్ట్స్‌తో రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో ధోనీ ‘మెంటర్- కమ్-ప్లేయర్’ పాత్రలో కనిపించే అవకాశం ఉందన్నారు. ఈ ఎడిషన్ ధోనీకి చివరిదై ఉండొచ్చు.. గత సీజన్‌లా చివర్లో బ్యాటింగ్ చేస్తారని అనుకుంటున్నాను.. కానీ ఈసారి ఆయన పాత్ర కొంచెం తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. 7వ స్థానంలో కాకుండా 8వ స్థానంలో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. తాను రిటైర్మెంట్ దిశగా కొనసాగుతున్నందున ఇలా చేయవచ్చని నా భావన.. అలా జరిగితే రుతురాజ్ గైక్వాడ్ అసలు సామర్థ్యం ఏమిటో మనం చూడగలుగుతామని ఆయన అన్నారు. ఇక జట్టులోకి సంజు శాంసన్ రావడంతో అతడినే కెప్టెన్‌గా నియమిస్తారని కొందరు భావిస్తున్నారు.. కానీ ఈ విషయంలో గైక్వాడ్ కే తన మద్దతును ఉత్తప్ప ప్రకటించారు.
►ALSO READ | Hardik Pandya: రూ. 12 కోట్ల కారులో గర్ల్ ఫ్రెండ్తో హార్దిక్ పాండ్యా షికారు
ఇప్పుడే కెప్టెన్సీ మార్పు అవసరం లేదని చెన్నై సూపర్ కింగ్స్ యజమాన్యానికి రాబిన్ ఉత్తప్ప సూచించారు. రుతురాజ్‌కు కొంత సమయం ఇవ్వాలి.. ఇప్పటికీ అతడే జట్టును నడిపిస్తున్నాడు.. ఎంఎస్ ధోనీ లాంటి లెజెండ్ నీడ నుంచి బయటకు వచ్చి తనదైన నాయకత్వాన్ని చూపడానికి అతడికి అవకాశం ఇవ్వాలని వెల్లడించారు. ఎంఎస్ ధోనీ ఆడని సమయంలో జట్టును నడిపిస్తూ తన ప్రతిభను నిరూపించుకునే ఛాన్స్ కల్పించాలని పేర్కొన్నాడు. ఫ్రాంచైజీకి రుతురాజ్ ఎక్కువ తప్పులు చేస్తున్నట్టు అనిపిస్తే అది వేరే విషయం.. కానీ సంజూ శాంసన్ వచ్చాడనే కారణంతో వెంటనే కెప్టెన్సీ మార్పు చేయడం మాత్రం సరైంది కాదని ఉతప్ప పేర్కొన్నారు.
